
మాటకు కట్టుబడి
● ఊరి బడికి ఊపిరి పోసిన గ్రామస్తులు
● సర్కారు సాయం కోసం ఎదురుచూపులు
కవిటి: మండలంలోని దూగాన పుట్టుగ వాసులు ఊరి బడికి ఊపిరి పోశారు. ప్రభుత్వ పోకడలతో ఈ బడి ఉనికే ప్రశ్నార్థకమైన వేళ పిల్లలందరినీ తీసుకువచ్చి బడిలో చేర్చి మళ్లీ పాత వైభవాన్ని తీసుకువచ్చారు. గ్రామస్తులు ఎంత చేసినా ప్రభు త్వ సాయం అందకపోతే బడి పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. వివరాల్లోకి వెళితే..
దూగానపుట్టుగలో ప్రాథమిక పాఠశాల ఒకప్పుడు అప్పర్ ప్రైమరీ బడిగా ఉండేది. 6,7 తరగతులు సమీపంలోని పాఠశాలలో కలిపేశారు. దీంతో ప్రాథమిక పాఠశాలగా మిగిలిపోయింది. దీని కొనసాగింపు కూడా ప్రశ్నార్థకమైంది. ఈ దశలో ఊరివారంతా సమావేశమయ్యారు. బడిని కాపాడుకోవాల నే లక్ష్యంతో ప్రైవేటు పాఠశాలల నుంచి పిల్లలను తీసుకువచ్చి ఈ బడిలో జాయిన్ చేశారు. ఒకేసారి 40 మంది చేరడంతో బడిలో పిల్లల సంఖ్య 59 కు చేరుకుంది. ఇంత మంది పిల్లలు ఉంటే నిబంధనల ప్రకారం దీన్ని మోడల్ ప్రైమరీ స్కూల్‌గా గుర్తించాలి. బేసిక్ ప్రైమరీ స్కూల్ అయితే ముగ్గురు ఉపాధ్యాయులు, మోడల్ ప్రైమరీ స్కూల్ అయితే ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాలి. కానీ ఇది ఇప్పటికీ ఏకోపాధ్యాయ పాఠశాలగానే ఉంది. ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఇటీవల బదిలీల్లో వేరే ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కానీ ఉపాధ్యాయుడు వచ్చినంత వరకు ఆయన ఇక్కడే ఉండాలి.
టీచర్ ఒక్కడే కావడంతో గ్రామస్తుల ఔదార్యంతో ముగ్గురు వలంటీర్లను నియమించారు. డీఎస్సీ నోటిఫికేషన్ సమయానికి ఈ బడిలో ఉన్న పిల్లల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే కేవలం ఒక్క టీచర్ పోస్టు మాత్రమే కేటాయించే వీలుంది. ప్రస్తుతం ఉన్న 59 మందికి ఆ ఒక్క ఉపాధ్యాయు డు సరిపోడు. మోడల్ ప్రైమరీ స్కూల్ అర్హత ఉన్న ఈ స్కూల్‌కు నలుగురు ఎస్‌జీటీలతో పాటు ఓ హెచ్‌ఎం ఉండాలి.ఆ గుర్తింపు రాకుంటే పిల్లలు నష్టపోతారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఈ బడిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
టీచర్‌ను నియమించాలి
ఈ బడిని కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రైవేటు బడుల్లో ఉన్న పిల్లలను ఇక్కడకు తీసుకుచ్చాం. ఉపాధ్యాయుల్ని నియమించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదే.
– దూగాన భద్రాచలం, సర్పంచ్, దూగానపుట్టుగ

మాటకు కట్టుబడి