
విన్నపాలు వినవలె..!
వంటశాల నిర్మాణానికి
అడ్డుపడుతున్నారు
శ్రీకాకుళం నగరంలో బొంతావారి వీధిలోని గీతా ప్రచారక వారి సమాజం వంటశాల నిర్మాణానికి తూర్పు పక్కనున్న ఇంటి యజమాని అడ్డుపడుతున్నారని, నిర్మాణం చేసేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గీతా ప్రచారక సమాజం ప్రతినిధులు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు, అన్నదానం, ధార్మిక ఉపన్యాసాలు, సేవా కార్యక్రమాలు చేస్తోందన్నారు. వంటశాల నిర్మాణం చేస్తుంటే తూర్పుపక్క ఉన్న ఇంటివారు చెత్తచెదారాలు ఆ స్థలంలో వేసి అడ్డుపడుతున్నారన్నారు. ఫిర్యాదు చేసినవారిలో జి.గోపాలకృష్ణ, రామారావు, మురకయ్య తదితరులు ఉన్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీదారుల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(మీకోసం)లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వైద్యారోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ, సర్వే అండ్ లాండ్ రికార్డులు, వ్యవసాయం, డ్వామా, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖల సమస్యలపై 140 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో ఎల్‌ఎన్‌వీ శ్రీధర్‌రాజ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వజ్రోత్సవాలు
శ్రీకాకుళం జిల్లా ఏర్పాటై ఆగస్టు 15వ తేదీ నాటికి 75 ఏళ్లు పూర్తవ్వనున్న నేపథ్యంలో ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలియజేశారు. శ్రీకాకుళం ఔన్నత్యాన్ని చాటి చెప్పేవిధంగా వేడుకలు నిర్వహించాలన్నారు. గొట్టా బ్యారేజీ నిర్మాణం, పొందూరు ఖాదీ, పలాస జీడిపప్పు ఫ్యాక్టరీ ఏర్పాటు, చరిత్ర కలిగిన దేవాలయాలు, జిల్లాలో ఉన్న ప్రాంతాల ప్రాచుర్యం, జిల్లాలోని ప్రముఖుల గురించి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వచ్చే వివిధ రకాల దరఖాస్తులను పరిశీలించి ప్రజలకు సేవలందించాలని అధికారులను ఆదేశించారు.
కిడ్నీ రోగులను ఆదుకోవాలి
పొందూరు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ రోగుల సంఖ్య పెరిగిందని, ఇటీవల కాలంలో సుమారు 19 మంది ఈ వ్యాధితో మృత్యువాత పడ్డారని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఈ మేరకు కృష్ణాపురం మరో ఉద్దానంగా మారకముందే అక్కడ వ్యాధికి గల కారణాలను అన్వేషించాలని కోరుతూ పీజీఆర్‌ఎస్‌లో సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం గ్రామంలో మరో 22 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య శిబిరాలు నిర్వహించి, కావాల్సిన మందులు, ఇతర సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. అలాగే ఆమదాలవలస నియోజకవర్గంలో ఇటీవల మంజూరైన నూతన పింఛన్లకు సంబంధించి లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకొని డబ్బులు ఇవ్వలేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనతో పాటు కృష్ణాపురం గ్రామానికి చెందిన ఎన్.చంద్రమౌళి, గోవిందరావు తదితరులు ఉన్నారు.
అడంగల్ ఇప్పించండి
కొత్తూరుకు చెందిన పొగిలి అన్నపూర్ణ తనకు తల్లిదండ్రులు కడగల సుందరరావు, కాంతమ్మల నుంచి వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించిన అడంగల్, 1–బీలు ఇప్పించాలని కోరుతూ పీజీఆర్‌ఎస్‌లో సోమవారం వినతిపత్రం అందజేసింది. తన తండ్రికి నాలుగు ఎకరాల పైన భూమి ఉండేదని, తాము ముగ్గురు అక్కచెల్లెళ్లమని ఫిర్యాదులో పేర్కొంది. తాను కుటుంబంలో పెద్ద అయినందున 1.90 సెంట్ల భూమి వాటా వచ్చిందని, అయితే ఆ భూమికి తహసీల్దారు అడంగల్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భూమిని తహసీల్దారు వేరేవారి పేరిట మార్చారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరింది. లేకపోతే ఆత్మహత్యే శరణ్యమని పేర్కొంది. అయితే అంతకుముందు అన్నపూర్ణ పురుగుల మందు డబ్బాను తనతో పాటు తీసుకు రావడం కలకలం సృష్టించింది. ఆమె బ్యాగును తనిఖీ చేసిన పోలీసులు పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.
మీకోసంకు భారీగా వినతులు
140 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విన్నపాలు వినవలె..!

విన్నపాలు వినవలె..!