
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గం
శ్రీకాకుళం పాతబస్టాండ్: కోర్టుల్లో ఏళ్లకు ఏళ్లు న్యాయ వివాదాలు నడుస్తున్నాయని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు పేర్కొన్నారు. 90 రోజుల మీడియేషన్ డ్రైవ్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మధ్యవర్తిత్వ శిక్షణ పొందిన న్యాయవాదులు కక్షిదారులకు అనుకూలంగా వ్యవహరించాలని, కోర్టు వెలుపలే పరస్పర రాజీలకు ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజలు చట్ట సహాయాన్ని పొందేందుకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు నెలలో చేపట్టిన కార్యకలాపాలపై సమీక్ష జరిపారు. సమావేశంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, పలువురు న్యాయవాదులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.