
పాలనపై వ్యతిరేకత దాచేందుకే..
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు అన్యాయమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఛీత్కారాలు ఎదురవుతున్నాయని, అందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్‌కు చంద్రబాబు తెర తీశారని తెలిపారు. ఇటీవల మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ సర్వే రిపోర్టు ప్రకారం 98 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నట్లు తేలిందన్నారు. ఇవి కప్పిపుచ్చే ప్రక్రియలో భాగంగానే మిథున్ రెడ్డి అరెస్టు జరిగిందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రభుత్వమే షాపులు నడిపిందని, ఇక స్కామ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. నిజానికి గత టీడీపీ కాలంలోనే పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు. 2014–19 లో 4380 లిక్కర్ షాపులు ఉండేవని, అన్నీ ప్రైవేటువేనని తెలిపారు. అప్పట్లో రాష్ట్రంలో 40 వేల పైగా బెల్టుషాపులు ఉండేవని, వీటిన్నింటికీ మద్యం సేకరణ కోసం 20 డిస్టిలరీలు ఉంటే... కేవలం 5 డిస్టలరీలకే 70 శాతం మద్యం కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చేవారని ఇది స్కామ్ కాదా అని ప్రశ్నించారు.
ఒక స్టోరీని మసాలా వేసి దట్టించి వండి ఒక ప్రణాళిక ప్రకారం 2024 ఆగస్టు 26న టీడీపీ సానుభూతిపరుడితో ఫిర్యాదు చేయించారని గుర్తు చేశా రు. 2019–24లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో లిక్కర్ షాపుల సంఖ్య తగ్గించామని, బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించామని తెలిపారు. అప్పట్లో 20 డిస్టిలరీలు ఉండేవని వీటిలో ఏ ఒక్కదానికి కూడా వైఎస్ జగన్ అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇందులో 14 డిస్టలరీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుమతి తెచ్చుకున్నవేనని తెలిపారు. కేసు, దర్యాప్తుల తీరుపై ఎల్లో మీడియాలో ఇష్టానుసారం రాస్తున్నారని, చంద్రబా బు చేస్తున్న ఈ రకమైన దుష్ట సంప్రదాయం అనేక పరిణామాలకు దారితీస్తుందన్నారు.
అన్నీ రెడ్‌బుక్‌లో భాగమే..
చార్జిషీట్‌లో ఏబీఎస్ బీసీ సెల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి స్టేట్‌మెంట్ ఉందని, స్టేట్‌మెంట్ ముందే తయారు చేసి దానిమీద సంతకం పెట్టమని తనను బలవంతం పెడుతున్నారని ఆయన హైకోర్టును ఆశ్రయించిన మాట వాస్తవం కాదా.? అని ప్రశ్నించారు. ఇదంతా లోకేష్ గొప్పగా చెప్పుకునే రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే జరుగుతోందన్నారు. ఇంత అరాచక పాలన దేశంలో ఎక్కడా ఉండదన్నారు.
రెడ్‌బుక్‌తో పరిశ్రమలు వెనక్కి..
ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయకుండా కంపెనీలకు భూములిచ్చే విషయంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రభు త్వ హయాంలో ఏ పరిశ్రమలు రాష్ట్రానికి రావడం లేదని, రెడ్‌బుక్‌తో పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయ ని అన్నారు. తమకు అంబేడ్కర్ రాజ్యాంగంపైన, కోర్టులపైన నమ్మకం ఉందని తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు తమ నాయకుడిని సంతృప్తి చేయడానికి నాసిరకం మద్యం తాగి ట్వీట్ చేసినట్లుందన్నారు. మంత్రివర్గంలో త్వరలో మార్పులు జరిగితే అచ్చెన్నాయుడు పదవి పోతుందన్న వార్తలు వస్తు న్న నేపథ్యలో ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి చౌకబారు ట్వీట్లతో గౌరవం పోగొట్టుకోవద్దని హెచ్చరించారు.
ఆధారాలు లేకుండా కేసులు ఎలా పెడతారు..?
ఆధారాలు లేకుండా కేసులు ఎలా పెడతారు, అరె స్టులు ఎలా చేస్తారని పలాస కోర్టు మెజిస్ట్రేట్ సీఐను హెచ్చరించిందని సీదిరి తెలిపారు. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడాలని లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని మెజిస్ట్రేట్ చెప్పిన తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారని తెలిపారు.
సర్వేలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది
అందుకే ఈ డైవర్షన్ రాజకీయాలు
మీడియా సమావేశంలో
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు