
రాష్ట్రంలో రాక్షస పాలన
ఆమదాలవలస: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అభివృద్ధిని విస్మరిస్తున్నారని మాజీ స్పీకర్, వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన ఆదివారం ఆమదాలవలసలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పాలనపై కాకుండా కక్ష సాధింపులపై దృష్టి పెడుతోందని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో రూ.2.50 లక్షల కోట్లను ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించామని గుర్తు చేశారు. లక్షన్నర పైచిలుకు సచివాలయ ఉద్యోగులతో పాటు నాలుగు లక్షల మంది వలంటీర్ల నియామకం జరిగిందన్నారు. ఉద్యో గ కల్పనలో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని తెలిపారు. ఇప్పుడు సంక్షేమం కరువైపోయిందన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూడ టం ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయ కక్షతో వేధిస్తున్నారని, వల్లభనేని వంశీ, పోసాని ఇలా ఒక్కొక్కరిని కక్షపూరితంగానే జైల్లో పెట్టారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా వేధిస్తున్నారని తెలిపారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వం చేతకానితనాన్ని తేటతెల్లం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం గద్దెనెక్కిన ఏడాదికే రూ.1,80,000 కోట్లు అప్పు చేసిందన్నారు. దీనిపై లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కారు చౌకగా ప్రభుత్వ భూములను కార్పొరేట్ వర్గాలకు ధారాదత్తం చేయటం మానుకోవాలని హితువు పలికారు. భారత రాజ్యాంగాన్ని విస్మరించి, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగితే, ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వస్తుందన్నారు. హత్యా రాజకీయాలను రూపుమాపాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు చిరంజీవినాగ్ పాల్గొన్నారు.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం