
ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వరా..?
● సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీపై రాష్ట్ర అధికారుల ఆగ్రహం
శ్రీకాకుళం: జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు రాష్ట్రస్థాయికి చెందిన ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారాన్ని అందించడం లేదని ఎస్‌పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష ఏపీసీలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు దీనిలో భాగంగా ఈనెల 10వ తేదీన జరగనున్న తల్లిదండ్రుల సమావేశానికి సంబంధించిన విషయాలపై చర్చించారు. అయితే శ్రీకాకుళం జిల్లాలోని ఆరు మండలాలకు యూనిఫాంలు, బూట్లు రాలేదని ఏపీసీ చెప్పగా, ఇప్పటివరకు రాష్ట్రస్థాయికి ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా పేరెంట్స్ డే జరగాల్సి ఉన్నా ఇంత నిర్లక్ష్యంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. సమావేశం రోజు తల్లిదండ్రులు ఆరోపిస్తే రాష్ట్ర అధికారులు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, అయినా తనకేమీ పట్టనట్లు వ్యవహరించడమేంటని ఏపీసీని నిలదీసినట్లు బోగట్ట.
చివరి స్థానంలో శ్రీకాకుళం
రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లా చట్టచివర స్థానమైన 26లో ఉంటుందని ఎస్‌పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఐదు సెక్టోరియల్ పోస్టులు రెండు నెలలకు పైబడి ఖాళీగా ఉంటే నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సెక్టోరియల్ అధికారులు లేకుండా పర్యవేక్షణ ఎలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్కొక్కరినీ రాజకీయ నాయకుల వద్దకు తీసుకు వెళ్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇటువంటి విధానాలు మానుకొని తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే సీఎంవో పోస్టుకు ఒక హెచ్‌ఎంను సిఫార్సు లేఖతో రాష్ట్రస్థాయికి పంపించడంతోనే ఎస్‌పీడీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు హెచ్‌ఎం ఏపీసీ బంధువుల గ్రామంలో ఉండడం వలన ఆయనను సీఎంవోగా నియమించేందుకు ఏపీసీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని ఇప్పటికే ఆగ్రహంతో ఉండగా, జిల్లాలోని ఆరు మండలాలకు కిట్లు రాలేదని సమావేశంలో చెప్పడంతో మరింత ఆగ్రహానికి కారణమైనట్లు తెలియవచ్చింది. ఈ విషయాలను ఏపీసీ శశిభూషణ్ వద్ద సాక్షి ప్రస్తావించగా తానే ఆరు మండలాలకు యూనిఫాంలు, బూట్లు రాలేదని ఎప్పుడు పంపిస్తారని అడిగానని చెప్పారు. తనపై ఎవరూ ఆగ్రహం వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. సీఎంవోగా నియమితుడైన హెచ్‌ఎం తన బంధువు కాదని స్పష్టం చేశారు.
10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలు మొదటి, రెండవ సంవత్సరాలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు విద్యకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సమావేశంలో తెలియజేసుకోవచ్చన్నారు. ఏక్ పేడ్ మాకీ నామ్ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ నుంచి మొక్కలు సరఫరా చేస్తామని, విద్యాలయాల ఆవరణలో నాటాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజనం కూడా కలిసి చేయాలన్నారు.
శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీకి అవార్డు
శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డు వచ్చినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. మన జిల్లాకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
రైలు ఢీకొని వృద్ధుడు మృతి
నరసన్నపేట: మండలంలోని ఉర్లాం రైల్వేస్టేషన్ వద్ద కుమ్మరిపేటకు చెందిన దువ్వారపు మల్లేసు (70) రైలు ఢీకొని మృతి చెందాడు. సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఆమదాలవలస రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.