
యువకుడు దారుణ హత్య
కొత్తూరు: బాకీ విషయమై తలెత్తిన వివాదం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఈ విషాద ఘటన కొత్తూరు మండలం వసప గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసప గ్రామంలో మలగాన శంకర్ అనే వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. ఇతనికి అదే గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు(19) అనే యువకుడు బాకీ ఉన్నాడు. ఎప్పుడు వీరిద్దరూ కలిసిన బాకీ విషయమై గొడవ జరిగేది. తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని శంకర్ తరచూ బెదిరించేవాడు. ఈ క్రమంలో మిన్నారావు శనివారం రాత్రి పకోడీ కొనేందుకు శంకర్ షాపు వద్దకు వెళ్లాడు. ఇంతవరకు ఉన్న బాకీ తీర్చాలని శంకర్ అడగడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో కొట్లాటకు దారితీసింది. ఈ క్రమంలో శంకర్ షాపులో ఉన్న సుత్తితో మిన్నారావు తలపై బలంగా కొట్టాడు. దీంతో మిన్నారావు కిందపడిపోయాడు. కొనఊపిరితో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా చాకుతో గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని షాపు ఎదురుగా ఉన్న పీహెచ్ రోడ్డు పక్కన పడేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆదివారం వేకువజామున రోడ్డు పక్కన మిన్నారావు మృతదేహం కనిపించడంతో అటువైపు వైపు వెళ్లిన స్థానికులు గుర్తించి మృతుడి లుకలాపు బుడ్డు, లక్ష్మిలకు తెలియజేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా కనిపించడంతో విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న సీఐ చింతాడ ప్రసాదరావు, ఎస్‌ఐ ఎండీ ఆమీర్ ఆలీ సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి బుడ్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆమీర్ ఆలీ తెలిపారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఈ హత్య జరిగి ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా, మిన్నారావు రోజువారీ కూలీ పనులు చేస్తుండేవాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అందివచ్చిన కొడుకు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద బాకీ విషయమై గొడవ
కత్తితో దాడికి పాల్పడిన షాపు నిర్వాహకుడు
వసపలో విషాద ఛాయలు

యువకుడు దారుణ హత్య