
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు దుర్మరణం
రణస్థలం: పిషిని పంచాయతీ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పైడిభీమవరం పంచాయతీ లొడగలపేట గ్రామానికి చెందిన నొడగల తవుడు(70) అనారోగ్యం, మతిస్థిమితం కారణంగా తరచూ బయటే తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడి శరీరం గుర్తు పట్టలేనంతగా నుజ్జునుజ్జుగా మారింది. కొన్ని గంటల తర్వాత తువ్వాలు, లుంగీ, చెప్పులను బట్టి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.కుమారుడు తాతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవే సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో వాహనం గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది.