
వివాహితను కబళించిన కిడ్నీ మహమ్మారి
వజ్రపుకొత్తూరు: ఒంకులూరు గ్రామానికి చెందిన వివాహిత దుమ్ము లక్ష్మీదేవి(39) ఆదివారం కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈమె కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. నెల రోజులుగా పలాస కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు పొందుతోంది. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడం, మందులు వాడేందుకు పేదరికం అడ్డురావడంతో మధ్యలోనే తనువు చాలించింది. లక్ష్మీదేవి భర్త రాజు వ్యవసాయ కూలీ. వీరికి ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తె ఉంది. గ్రామస్తులు, బంధువుల సహకారంతో గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.