
ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను, పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ (1938) జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షుడు బి.రవి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో పలువురు వక్తులు మాట్లాడారు. నాడు–నేడుతో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తిచేయాలని కోరారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌ల పేరిట బడుల్లో విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. గిన్నిస్‌రికార్డుల కోసం ఆరాటమే తప్ప విద్యాభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా పూర్వ అధ్యక్షులు టి.చలపతిరావు, ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, బాలాజీరావు, ఆర్.వి.అనంతాచార్యులు, బి.నవీన్, కృష్ణారావు, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్ తగదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ట్రోలింగ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీకాకుళం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థలో భాగమైన ఉన్నత న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్నా ట్రోలింగ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.వ్యక్తి కంటే వ్యవస్థలే ముఖ్యమని, అటువంటి వారిని అవమానిస్తే, న్యాయవ్యవస్థను అవమాన పరిచినట్లేనని పేర్కొన్నారు. ట్రోల్ చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించించాలని కోరారు.
ఉత్సాహంగా
చెస్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో రాణించి జిల్లాకు పేరుతీసుకురావాలని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బగాది కిషోర్ ఆకాంక్షించారు. జిల్లాస్థాయి అండర్–15 చెస్ ఎంపిక పోటీలు ఆదివారం ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు పాల్గొని ఎత్తుకు పైఎత్తులేశారు. బాలుర విభాగంలో డొంకాడ కార్తికేయ ప్రథమ, బొల్ల యశ్వంత్ ద్వితీయ, ఎన్‌కేపీ నిహల్ తృతీయ, పొన్నాడ వేదిష్ నాలుగో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో మెట్ట తీక్షణ, బొల్ల శృతి, జామి వినమ్ర, రిత్విక తొలి నాలుగు స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 12, 13 తేదీలలో విశాఖపట్నంలో జరిగేరాష్ట్ర స్థాయి అండర్– 15 చెస్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ఆల్ ఇండియా చెస్సేన్ స్కూల్స్ కమిటీ సభ్యులు సనపల భీమారావు పేర్కొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చెస్ సంఘ కార్యదర్శి జామి రమేష్, సంయుక్త కార్యదర్శి వై.ఎస్.వి.కుమార్, కోచ్ అభినవ్, అసోసియేషన్ సభ్యులు వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
వివాహిత ఆత్మహత్య
నందిగాం: రాంపురం పంచాయతీ జయపురం గ్రామానికి చెందిన రాంపురం రత్నాలు(54) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రత్నాలుకు కంటి సమస్యతో బాధపడుతోంది. భర్త మహేష్ విశాఖపట్నం ఎల్‌వీ ప్రసాద్ ఆసుసత్రికి తీసుకువెళ్లి అన్ని పరీక్షలు చేయించినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్థాపం చెందిన శనివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. భర్త మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ కన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలి

ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలి