అరసవల్లి: ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందడి కనిపించింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి (శయన ఏకాదశి)గా జరుపుకుంటున్న క్రమంలో ఆదివారం అరసవల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలవిరాట్టుకు ప్రత్యేకంగా తులసీదళాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు సర్వదర్శనాలకు అనుమతించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పలువురు సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. అంతరాలయంలో ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు చేయించారు. కాగా, అన్నప్రసాద వితరణలో అధికారుల చర్యలపై భక్తులు బాహాటంగానే విమర్శించారు. తలనీలాల టిక్కెట్లు ధరల కంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారంటూ భక్తులు ఫిర్యాదులు చేశారు.
వైభవంగా ఆదిత్యుని కళ్యాణం..
సూర్యనారాయణ స్వామి వారి కల్యాణ సేవ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఉషా పద్మిని ఛాయా దేవేరులతో సూర్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను కల్యాణమూర్తులుగా అలంకరించి అనివెట్టి మండపంలో కొలువుదీర్చారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ, వేదపండితుల బృందం కల్యాణం జరిపించారు.
ఆదిత్యుని సన్నిధిలో తొలి ఏకాదశి సందడి