
బొరిగివలసలో విషాదం
నరసన్నపేట: మండలంలోని బొరిగివలసలో విషాదం అలుముకుంది. అనకాపల్లి జిల్లాలో తలుపులమ్మ తల్లికి మొక్కులు తీర్చుకునేందుకు గ్రామస్తులతో కలిసి వెళ్లిన రాజాపు గురన్న (64) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కశింకోట మండలం భయ్యవరం వద్ద వాహనం నిలిపి జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా మరో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొంది. దీంతో గురన్న అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ఇచ్ఛాపురం వద్ద పోలీసులు గుర్తించారు. సోమవారం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా గురన్నకు భార్య వడ్డేమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలకు వివాహాలు కాగా, మృతుడు తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురన్న మృతికి పొందర కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజాపు అప్పన్న, బొరిగివలస ఎంపీటీసీ బుగ్గ జగదీశ్వరి, వైఎస్సార్‌సీపీ నాయకుడు బగ్గు రమణయ్యలు సంతాపం తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యాచకుడి దుర్మరణం
ఇచ్ఛాపురం: రోడ్డు ప్రమాదంలో యాచకుడు మృతి చెందాడని పట్టణ పోలీసులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారి–16పై చిత్తూరు నుంచి బరంపురం నగరానికి టమాటా లోడ్‌తో లారీ వెళ్తోంది. అదే సమయంలో బెల్లుపడ టోల్‌ప్లాజా సమీపంలో సాహు అనే యాచకుడు రోడ్‌పై నడుచుకుని వెళ్తుండగా అతడిని తప్పించబోయి లారీ ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో యాచకుడు మృతి చెందగా, లారీ డ్రైవర్ కూడా గాయాలపాలయ్యాడు. వీఆర్వో నర్తు కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బొరిగివలసలో విషాదం