
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలు పెండింగ్‌లో లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(మీకోసం)లో అర్జీదారుల నుంచి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌తో కలిసి అర్జీలు స్వీకరించారు. ఒక సమయంలో అర్జీలు ఇచ్చేందుకు ఫిర్యాదుదారులు గుమిగూడడంతో కలెక్టర్ చొరవ తీసుకొని, ఆయనే స్వయంగా వెళ్లి వారిని క్యూలో పెట్టారు. అర్జీదారులు గుంపులుగా రావడం వలన వారు చెప్పే విషయం తెలియడం లేదని, అందరూ సంయమనం పాటించాలని కోరారు. దీనిలో భాగంగా రెవెన్యూ, పంచాయతీ రాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వైద్యారోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ, డీసీహెచ్‌ఎస్, ఏపీఈపీడీసీఎల్, గృహ నిర్మాణ శాఖ, సర్వే అండ్ లాండ్ రికార్డులు, వ్యవసాయం, దేవదాయ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల సమస్యలపై 60 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో ఎల్‌ఎన్ వి.శ్రీధర్ రాజ తదితరులు ఉన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కొన్ని వినతులు పరిశీలిస్తే...
● పాతపట్నం మండలం యాగంటి అప్పన్నమ్మ వారసులు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల కూడా రాసి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. తనకు తన ఆస్తిని అమ్ముకోనే విధంగా, తన ఆరోగ్యం బాగులేనందున వైద్యం చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
● ఎయిడ్స్ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు గతంలో తొలగించబడిన నాగభూషణరావుని తిరిగి విధుల్లోకి తీసుకోవద్దని కోరారు.
● ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామ పంచాయతీ జాలారి కొయ్యాం, బడివానిపేట గ్రామ పంచాయతీల్లో గల సర్వే నంబర్లు 341, 342, 430, 431, 437లోని భూముల్లో సాగులో ఉన్నవారికి పట్టాలు మంజూరు చేయాలని మత్స్యకారులు కోరారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
మీకోసంలో 60 అర్జీల స్వీకరణ