
కుక్కల దాడిలో మేక పిల్లలు మృతి
టెక్కలి రూరల్: కోట బొమ్మాళి మండలం దుప్పిలపాడు గ్రామంలో గురువారం రాత్రి వీధి కుక్కలు దాడిచేసి సుమారు 10 మేక పిల్లలను చంపేశాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. దుప్పిలపాడు గ్రామానికి చెందిన సబ్బి లక్ష్మణరావు, బి.సింగి కి చెందిన 13 మేకపిల్లలను ఒక పాకలో ఉంచారు. గురువారం రాత్రి గ్రామంలో తిరిగే వీధి కుక్కలు ఆ మేక పిల్లలపై దాడికి పాల్పడ్డాయి. దీంతో ఆ మందలోని 10 మేకపిల్లలు అక్కడికక్కడే మృతిచెందాయి. మిగిలిన మూడు మేకపిల్లలు తీవ్ర గాయాలకు గురైనట్లు బాధితులు తెలిపారు. మృతిచెందిన మేక పిల్లల విలువ సుమారు రూ.80వేలు వరకు ఉంటుందని బాధితులు వాపోతున్నారు.
రెండు కేజీల గంజాయితో వ్యక్తి అరెస్టు
ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి చైన్నెకు 2.150 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని ఇచ్ఛాపురం పట్టణ పోలీసులు పట్టుకున్నట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గంజాం జిల్లా దిగపొహండి బ్లాక్ బోనమాలి గ్రామానికి చెందిన ఖిరాసింధునాయక్ తప్తపాణీ ప్రాంతంలో శరత్ అనే వ్యక్తి వద్ద రూ.5వేలకు గంజాయి కొనుగోలు చేశాడు. చైన్నెలో విక్రయించేందుకు తీసుకెళ్తుండగా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుబడ్డాడు. ఇతని వద్ద నుంచి 2.150 కేజీల గంజాయి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో పట్టణ ఎస్సై ముకుందరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కుక్కల దాడిలో మేక పిల్లలు మృతి