
16 నుంచి జీడి కార్మికుల సమ్మె
కాశీబుగ్గ: జీడి పరిశ్రమల్లో పనిచేసే అన్ని రకాల కార్మికులు ఈ నెల 16 నుంచి సమ్మె చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు కాష్యూ లేబర్ యూనియన్ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి అన్నారు. కార్మికులకు వేతన ఒప్పందం ఈ నెల 16తో రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పలాస కాష్యూ మాన్యుఫ్యాక్షర్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపామని, వారు పాత వేతనాలే ఇస్తామని చెబుతుండటంతో సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. వేతనాలు పెంచే వరకు సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీ, డీసీఎల్, ఏసీఎల్, కాశీబుగ్గ సీఐలకు సమ్మె నోటీసులు అందించారు. కార్యక్రమంలో నాయకులు లొడగల కామేశ్వరరావు, బొంపల్లి సింహాచలం, కోనారి రాము, సానా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.