
దళారులు చెప్పిందే
● ఉద్దానంలో జీడి పిక్కల అమ్మకాలు ప్రారంభం
● ఒక్కో గ్రామంలో ఒక్కో రేటు
● రైతుకు దక్కని మద్దతు ధర
పలాస: మద్దతు ధరపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్దానంలో జీడిపిక్కల రైతులు అన్యాయానికి గురవుతున్నారు. దళారులు చెప్పిన ధరకే పిక్కలు అమ్ముకుంటున్నారు. ఇటీవలే పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో జీడి పిక్కల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. తోటల్లో మార్చి నుంచి సేకరించిన జీడిపిక్కలను ప్రస్తుతం అమ్మకాలు చేపడుతున్నారు. అయితే పలాస మార్కెట్‌లో 80 కిలోల బస్తా ధర రూ.13,500 ఉందని పలాస పారిశ్రామికవాడ జీడి ఉత్పత్తులదారుల సంఘం అద్యక్షుడు మల్లా రామేశ్వరరావు చెబుతున్నారు. అయితే మూడు నెలల తర్వాత మాత్రమే చెల్లింపులు జరుగుతాయని అంటున్నారు. మరోవైపు గ్రామాల్లో ఒక్కో చోట ఒక్కో ధర వినిపిస్తోంది. వజ్రపుకొత్తూరు మండలం పెద్ద బొడ్డపాడు గ్రామంలో రైతులు తమ గ్రామానికి వచ్చిన చిల్ల వర్తకులు(దళారులు)కు మార్కెట్ ధరతో సంబంధం లేకుండా బస్తా ధర రూ.12వేలుకు విక్రయిస్తుండగా, సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో బస్తా ధర రూ.13000కు రైతులు అమ్మకాలు చేపట్టారు. పలాస మండలం బొడ్డపాడు పరిసర గ్రామాల్లో మాత్రం రూ.13,500 బస్తా ధర పలుకుతోంది. అయితే ఈ గ్రామాల్లో ధర ఇంకా నిర్ణయం కాలేదు.
కానరాని సమావేశాలు..
గ్రామాల్లో ప్రజలంతా ఒక చోట సమావేశమై మార్కెట్ ధరను పరిశీలించి పలాస వ్యాపారులతో సంప్రదించాక జీడిపిక్కలు ధర నిర్ణయించడం ఆనవాయితీ. ఈసారి మాత్రం గ్రామాల్లో ఇంకా అటువంటి సమావేశాలు జరగలేదు. గ్రామ కమిటీలు ధర నిర్ణయించలేదు. త్వరలో సమావేశాలు జరుగుతాయని, అప్పటి వరకు జీడి పిక్కలను అమ్మరాదని ఆయా గ్రామాల ప్రజలకు గ్రామ కమిటీలు పెద్దలు చెబుతున్నారు. జీడి పిక్కల రైతాంగ కమిటీలు మాత్రం గత కొన్నేళ్లుగా జీడి మద్దతు ధర కోసం పోరాటాలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర 80 కిలోల బస్తాకు రూ.16వేలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఈ ధరలు పెరుగుతాయా లేక ఇంతకన్నా తక్కువకు దిగజారుతాయా అన్నది ప్రశ్నార్ధకంగానే ఉంది. రైతు సమాజంలో పండించిన అన్ని పంటలకు అన్నిచోట్లా ఒకే ధర ఉండగా జీడి పిక్కకలకు మాత్రం ఎప్పుడు కూడా ఒక ధరంటూ లేకపోవడం గమనార్హం. రైతు చేతిలో ధర లేదనేది మాత్రం వాస్తవం. పలాస వ్యాపారులు ఏది చెబితే అదే రేటనే అపవాదు మాత్రం ఒకటి ఉంది. ఈ ఏడాది ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ధర విషయం ఏం చేస్తారో వేచి చూడాల్సిందేనని జీడిపిక్కల రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మోసపోతున్నారు..
జీడి రైతులు ప్రతి ఏడాది దళారుల చేతిలో మోసపోతున్నారు. ఉద్దానం జీడి రైతులు మద్దతు ధర కోసం ప్రతి ఏడాది పోరాడుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ప్రభుత్వాలు ఎన్నికల్లో మద్దతు ధర ఇప్పిస్తామని హామీలు ఇస్తున్నారు. ఆ తర్వాత వ్యాపారులతో కలిసిపోతున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకొని దోపిడీ చేస్తున్నారు. మద్దతు ధర విషయంలో అధికార పార్టీ మాట నిలబెట్టుకోవాలి.
– తెప్పల అజయ్‌కుమార్, రైతు, మాకన్నపల్లి, జీడి రైతాంగ పోరాట నాయకుడు, పలాస
దిగుబడులు లేవు..
మా గ్రామంలోకే వచ్చి కొనుగోలు చేసిన వ్యాపారికి 80 కిలోల బస్తా పిక్కలను రూ.13వేలకు అమ్ముకున్నాను. నాకు 4 ఎకరాల జీడి తోట వుంది. మొత్తం 12 బస్తాల పిక్కలయ్యాయి. ఇంట్లో నిల్వ ఉంచుకోవడం కంటే అమ్మేయడమే మంచిదని అమ్ముకున్నాను. పెట్టుబడులకు తగ్గ దిగుబడులు రాలేదు. – మోస బాలమ్మ,
జీడి రైతు, ఎర్రముక్కాం, సోంపేట మండలం

దళారులు చెప్పిందే

దళారులు చెప్పిందే

దళారులు చెప్పిందే