
సంస్కరణలకు సన్నద్ధం
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు నిర్వహించిన ఓరియంటేషన్ తరగతులు ముగిశాయి. జాతీయ విద్యావిధానం, జాతీయస్థాయిలో జరిగే పరీక్షలకు విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో మార్పులు–చేర్పుల ద్వారా మారిన సిలబస్‌లు, ప్రశ్నపత్రాల పేట్రన్లలో మార్పులు, రూపుదిద్దుకున్న ఇతరత్రా కొత్త అంశాలపై అధ్యాపకులకు శిక్షణను అందించారు. జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో గత నెల 24న మొదలైన ఈ ఓరియంటేషన్ శిక్షణా తరగతులు గురువారం సాయంత్రంతో ముగిశాయి.
38 కళాశాలల నుంచి..
శ్రీకాకుళం జిల్లాలో 38 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న రెగ్యులర్, ఎంటీఎస్, పార్ట్‌టైం, కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లకు ఈ ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహించారు. లాంగ్వేజ్‌లు, మ్యాథ్స్, సైన్స్, ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టుల్లో అధ్యాపకులు బోధించారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మరళా మధ్యామ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విషయపరిజ్ఞానాన్ని బోధించారు. ప్రధానమైన అంశాలపై వెబెక్స్ ద్వారా నిష్ణాతులు రిసోర్స్‌పర్సన్‌గా హాజరై క్లాసులు నిర్వహించారు. ఇంటర్మీడియెట్ విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలను ఇంటర్‌విద్య డైరెక్టర్ వివరించారు.
సంస్కరణలకు సహకరించాలి: డైరెక్టర్
ఇంటర్‌విద్యలో రాష్ట్రప్రభుత్వం మార్చిన సంస్కరణలకు అందరూ సహకరించి, విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించేలా ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఇంటర్‌విద్య డైరెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఓరియెంటేషన్ ఆన్‌లైన్ క్లాసుల్లో ఆమె మాట్లాడుతూ జూన్ 1కి బదులు ఏప్రిల్ ఒకటో తేదీనే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించామని, ఏప్రిల్ 7 నుంచి అడ్మిషన్లను మొదలుపెట్టామన్నారు. నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ఏపీ విద్యార్థులు పోటీపడేలా చేసేందేకే సిలబస్‌లలో సమూలంగా మార్పులు చేశామని, ప్రశ్నపత్రం పేట్రన్‌లో మార్పులు చేసినట్టు వివరించారు. ఐచ్ఛిక సబ్జెక్టులను ఎంపికచేసుకునే అవకాశం కూడా విద్యార్థులకు కల్పించినట్టు వివరించారు. ఐపీఈ మార్చి–2025 ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థుకు రెమీడియల్ క్లాసులు నిర్వస్తున్నామన్నారు. ఈ ఏడాది ఫస్టియర్ విద్యార్థులకు మారిన సిలబస్ ప్రకారం పాఠ్యపుస్తకాలు రానున్నాయని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం క్లాసులకు హాజరయ్యే అధ్యాపకుల హాజరు, ఏర్పాట్లు, సౌకర్యాలను ఆర్‌ఐఓ/ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రగడ దుర్గారావు స్వయంగా పర్యవేక్షించారు. అధ్యాపకుల హాజరును ఇంటర్మీడియెడ్ విద్య ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్లకు విషయపరిజ్ఞానం పెంచేలా చర్యలు
ముగిసిన ఓరియంటేషన్ క్లాసులు
సిలబస్‌లు, ప్రశ్నపత్రాల మార్పులపై
నిష్ణాతులతో బోధన
విజయవంతంగా ముగిశాయి..
శ్రీకాకుళంలో గత నెల 24 నుంచి మే 8వ తేదీ వరకు 13 సబ్జెక్టుల్లో అధ్యాపకులకు నిర్వహించిన ఓరియెంటేషన్ క్లాసులు విజయవంతంగా ముగిశాయి. దాదాపు అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు క్లాసులకు హాజరయ్యారు. ఇంటర్‌విద్య డైరెక్టర్ అనేక అంశాలపై దిశానిర్దేశం చేశారు. మారిన సిలబస్, పేట్రన్ ప్రకారం రిసోర్స్‌పర్సన్ల పలు కీ పాయింట్లను లెక్చరర్లకు వివరించారు.
– ప్రగడ దుర్గారావు, ఆర్‌ఐఓ శ్రీకాకుళం
ఓరియెంటేషన్ క్లాసులు జరిగిన షెడ్యూల్ సబ్జెక్టులు
ఏప్రిల్ 24, నుంచి 26 వరకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ
ఏప్రెల్ 28, 29 తేదీల్లో మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ
మే 5, 6 తేదీల్లో కామర్స్, హిస్టరీ, సంస్కృతం
మే 7, 8 తేదీల్లో సివిక్స్, ఎకనామిక్స్, జువాలజీ

సంస్కరణలకు సన్నద్ధం