
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జరుగుతున్న జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీల్లో భాగంగా రెండో రోజు కూడా బాల బాలికలు అదిరేటి ఆటతీరును కనబరిచారు. ముఖ్యంగా అండర్–17 బాలు ర పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం ఏడు క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు జరిగాయి. ఇందులో బాల్‌బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్‌టెన్నిస్, సాఫ్ట్‌బాల్, తైక్వాండో, ఫెన్సింగ్ క్రీడాంశాల్లో ఎంపికలు జరిగాయి. స్విమ్మింగ్ ఎంపికలు శాంతినగర్ కాలనీలోని డీఎస్‌ఏ సిమ్మింగ్ పూల్ వేదికగా జరిగాయి. అలాగే టేబుల్ టెన్నిస్ ఎంపికలు శ్రీకాకుళం పీఎన్ కాలనీలోని న్యూసెంట్రల్ స్కూల్ వేదికగా జరిగాయి. తైక్వాండో, ఫెన్సింగ్ ఎంపికలు శ్రీకాకు ళం టౌన్‌హాల్ వేదికగా జరిగాయి. షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు శాంతినగర్ కాలనీలోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో జరిగాయి. ఈ ఎంపికలు జరుగుతున్న తీరును డీఈఓ కె.వెంకటేశ్వరరావు సంబంధిత అధికారులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి బీవీ రమణ, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, ఎం.సాంబమూర్తి, కె.మాధవరావు తదితరులు పర్యవేక్షించారు.