
శాలిహుండం బౌద్ధారామాన్ని పరిశీలిస్తున్న పర్యాటక శాఖ ఈడీ మల్‌రెడ్డి (ఫైల్)
అందాలలో
అరసవల్లి: సముద్ర తీరాలు, ఆధ్యాత్మిక స్థలాలు, ఎత్తైన పర్వతాలు, నదీ సంగమ స్థలాలు, చారిత్రక ప్రాంతాలు శ్రీకాకుళం వైభవాన్ని చాటుతున్నాయి. ఈ పర్యాటక ప్రదేశాలను చూసేందుకు జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేలా పలు బీచ్‌లను గుర్తించిన రాష్ట్ర పర్యాటక శాఖ, శాలిహుండం వంటి పురాతన ప్రాంతాల్లో పర్యాటకులకు వసతి సౌకర్యాలు మెరుగుపరిచేలా చర్యలు చేపడుతోంది. అలాగే విద్యార్థి దశ నుంచే పర్యాటక విశిష్టత తెలియజేసేందుకు పలు కళాశాలు, పాఠశాలల్లో విద్యార్థులతో యువ టూరిజం క్లబ్‌లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటికే 66 క్లబ్‌లు నమోదై జిల్లాలో పర్యాటక యాత్రలు చేస్తున్నారు.
గ్రీన్ టూరిజం లక్ష్యంగా..
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది పర్యాటక ప్రాంతాల్లో గ్రీనరీని మరింత మెరుగుపర్చాలనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిశానిర్దేశం చేశాయి. ఈ మేరకు జిల్లాలో బుధవారం ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఈ దిశగా అధికారులు అడుగులు వేయనున్నారు. అరసవల్లి, శ్రీముఖలింగం, శ్రీకూర్మం, శాలిహుండం, దంతపురి, బారువ, పొందూరు, బెజ్జిపురం, బుడితి, కూర్మ తదితర ప్రసిద్ధ స్థానాల్లో కూడా పచ్చదనం నిండేలా చర్యలు చేపట్టేలా ప్రణాళికలను నేటి నుంచి అమలు చేయనున్నారు.
పర్యాటకులు వస్తున్నారిలా..
జిల్లాలో పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2022–23 లో సుమారు 45 లక్షల మంది స్వదేశి, 52 మంది విదేశీ పర్యాటకులు జిల్లాను సందర్శించినట్లుగా టూరిస్ట్ ఫుట్‌ఫాల్ లెక్కలు చెబుతున్నాయి. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా స్వదేశీ పర్యాటకులు సుమారు 20 లక్షల వరకు చేరినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఇక జిల్లాలో ప్రసిద్ధమైన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయంతో పాటు టెంపుల్ టూరిజంలో భాగంగా ఉన్న శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామి ఆలయం, శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వర స్వామి వారి ఆలయం, రావివలసలోని ఎండల మల్లికారున స్వామి వారు, మందసలోని శ్రీవాసుదేవుని ఆలయంతో పాటు సుమారు 52 ప్రముఖ ఆలయాలు జిల్లా పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. వీటితో పాటు బౌద్ధారామాలైన శాలిహుండం, నగరికటకం (గార), దంతపురి (సరుబుజ్జిలి), జగతిమెట్టు, జొన్నాం (పోలాకి), ప్రాచీన శిలాశాసనాల ప్రాంతాలుగా నగరాలపేట, కళింగపట్నం (గార), దీర్ఘాసి (పోలాకి), జైన ఆరామాలుగా సంగమయ్య కొండ (ఆమదాలవలస), పాండవుల మెట్ట (టెక్కలి), విష్ణుకొండ ( సరుబుజ్జిలి), సంస్థానాల కోటలుగా మందస, సురంగిరాజా (ఇచ్ఛాపురం), తర్లకోట (టెక్కలి), డచ్ భవనం (శ్రీకాకుళం), లైట్‌హౌస్ (కళింగపట్నం, బారువ) తదితర ప్రాంతాలు నిత్యం పర్యాటకులతో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఇటీవల వెలుగులోకి వచ్చిన కూర్మ వైదిక గ్రామం కూడా నిత్యం పర్యాటకులతో కళకళలాడుతున్నాయి.
మరింత ఆహ్లాదం కోసం బీచ్‌లు
జిల్లాలోని బీచ్‌లను మరింత ఆహ్లాదంగా తయారు చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర బృందం ఒకటి జిల్లాలో పర్యటించింది. రాష్ట్రంలో అత్యఽధికంగా స్థానిక జిల్లాలోనే 67 బీచ్‌లను ఆధునికీకరించడానికి గుర్తించారు.
● అనుకూల వాతావరణానికి కృషి
రాష్ట్రంలో పర్యాటకులు అధికంగా సందర్శించే జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. ఎన్నో పురాతన ఆలయాలు, ప్రదేశాలు, చూడచక్కని ఆకట్టుకునే అప్‌హిల్స్, సహజసిద్ధమైన బీచ్‌లు మన జిల్లాలో ఉన్నాయి. పర్యాటకులను ఆకట్టుకునేందుకు వీలుగా సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా 67 బీచ్‌లను గుర్తించి కోస్టల్ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపడుతున్నాం. 66 యువక్లబ్‌ల ద్వారా విద్యార్థులకు పర్యాటక స్థలాల విశిష్టతలు, జిల్లా చరిత్ర విశేషాలు తెలిసేలా చర్యలు చేపడుతున్నాం.
– ఎన్.నారాయణరావు,
జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖాధికారి.
నేడు హెరిటేజ్ వాక్
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో హెరిటేజ్ వాక్ పేరిట ప్రత్యేక ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి సూర్యమహల్ వద్ద ఉన్న జామియా మసీద్ వరకు యువక్లబ్ మెంబర్లతో భారీ ర్యాలీ నిర్వహింంచనున్నారు. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ మీద ప్రతిజ్ఞ చేయించనున్నారు.
నియోజకవర్గాల వారీగా బీచ్‌లు పరిశీలిస్తే..
శ్రీకాకుళం: కుందువానిపేట, గనగళ్లవానిపేట, బలరాంపురం, కళింగపట్నం, శ్రీకూర్మం(మత్స్యలేశం), మొగదాలపాడు, కొమరివానిపేట, బందరువానిపేట, కె.మత్స్యలేశం.
ఎచ్చెర్ల: బడివానిపేట, బుడగట్లపాలెం–1, బుడగట్లపాలెం–2, డి.మత్య్సలేశం, రాళ్లపేట, కె.మత్స్యలేశం, శివాజీ దిబ్బలపాలెం, కొత్త దిబ్బలపాలెం, పాత దిబ్బలపాలెం.,పోతయ్యపాలెం, అల్లివలస, జీడిపాలెం, కొవ్వాడ, చీకటివానిపేట, దోనిపేట, గురయ్యపేట.
నరసన్నపేట: రాజరామపురం, పెద్దకొవిరిపేట, జోగంపేట, కొత్తరేవు,గొల్లవానిపేట, గుప్పిడిపేట.
పలాస: ఎం.గంగువాడ, గడ్డేరు, బేతాళపురం, రట్టి
వజ్రపుకొత్తూరు: మంచినీళ్లపేట,డొంకులపాడు, కంబాలరాయుడుపేట, అక్కుపల్లి, గుణుపల్లి, నువ్వలరేవు, హుకుంపేట, తొట్టూరు, దేవునల్తాడ, కొత్తపేట.
ఇచ్ఛాపురం: బారువ, రామయ్యపట్నం, ఇసుకలపాలెం, బట్టిగల్లూరు, ఎక్కూరు, సిహెచ్.గొల్లగండి, కపాసుకుద్ది, పుక్కళ్లవానిపాలెం, కొత్తపాలెం, చిన్నకర్రివానిపాలెం, పెద్దకర్రివానిపేట, ఇద్దువానిపాలెం, కొత్తకళింగపట్నం (ఒంటూరు), బట్టివానిపాలెం, డొంకూరు.
టెక్కలి: భావనపాడు, గెద్దలపాడు, ఎం.సున్నాపల్లి, పిట్టవానిపేట, కుందువానిపేట, పాతమేఘవరం, మరువాడ.
జిల్లాలో పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య
కొత్తగా 67 బీచ్‌ల అభివృద్ధికి చర్యలు
వసతి కల్పనపై దృష్టి సారించిన పర్యాటక శాఖ
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

శాలిహుండం బౌద్ధారామం వద్ద యువక్లబ్‌ల పర్యటన
