
పాతపట్నం: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఫిర్యాదుదారులు సమస్యలు విన్నవించారు. మొత్తం 123 మంది వినతులు సమర్పించారు. జిల్లా స్థాయి స్పందనతో పాటు ఒక్కో మండలంలోనూ జగనన్నకు చెబు దాం కార్యక్రమాలను నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్, జేసీ ఎం.నవీన్ తెలిపారు. ఆయనతో పాటు టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, ఎస్‌డీసీ జయదేవి, ఏఎస్పీ విఠలేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ విద్యాసాగర్, డ్వామా పీడీ చిట్టిరాజు, జెడ్పీ సీఈఓ వెంకట్రామన్, డీఈఓ వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీడీ ఎన్.గణపతిరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ టీఎస్ ప్రసాద్, పీడీ బి.శాంతిశ్రీ, పశుసంవర్ధకశాఖ జేడీ ఎం.కిశోర్, సర్వేయర్ ఏడీ విజయ కుమార్, తహసీల్దార్ రవిచంద్ర, ఎంపీడీఓ జయంత్ ప్రసాద్‌తోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
● గంగువాడ పంచాయతీ మెట్టుపేట గిరిజన గ్రామం పక్కన ఉన్న క్వారీ వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, క్వారీని నిలుదల చేయాలని గిరిజనులు విన్నవించారు. ● పాతపట్నం, ప్రహరాజపాలేం,బూరగాం, కొరసవాడ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డలు, వాగులు ఆక్రమించారని వైఎస్సార్‌సీపీ నాయకుడు బి.నారాయణమూర్తి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జి.అప్పన్న ఫిర్యాదు చేశారు. ● సీతారాంపల్లి, బూరగాం, బొరుభద్ర గ్రామాల పంట పోలాలకు కొరసవాడ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించాలని సీతారాంపల్లి వైఎస్సార్‌సీపీ నాయకులు మురళీ ఆప్టో, సత్య బిస్వాల్‌లు విన్నవించారు. ● గుమ్మగెడ్డ, పొగడవల్లి గెడ్డలు బాగు చేయాలని వైస్ ఎంపీపీ సవిరిగాన ప్రదీప్ కోరారు. ● పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో 300 మంది నిరుపేదలు ఉన్నారని వారికి జగనన్న ఇళ్ల స్థలాలు ఇప్పించాలని వైస్ ఎంపీపీ ప్రదీప్ కోరారు. ● పాతపట్నం మహేంద్ర తనయ నది ఒడ్డున ఉన్న పంప్ హౌస్‌కు 24గంటలు విద్యుత్ ఇప్పించాలని, ఇందిరమ్మ కాలనీ వాసులకు శ్మశాన వాటికకు స్థలం ఇప్పించాలని, ఎస్సీ కాలనీకు డ్రైనేజీ, సామాజిక భవనంతో పాటు నీలమణిదుర్గ కాలనీ వాసులకు అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేయాలని సర్పంచ్ శిర్ల వేణుకుమారి కోరారు.
● ధర్మసాగరం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని, రంకిణి, తిడ్డిమి, బైరాగిపేట, భగంతర, చంగుడి, సరాల గ్రామాలకు చెందిన రైతులు తులు గు ప్రవీణ్, రామారావు, వెంకటరమణలు విజ్ఞప్తి చేశారు. ● కొదూరు, ప్రహరాజపాలెం గ్రామానికి చెందిన నిరుపేదలకు జగనన్న ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కొదూరు సర్పంచ్ పనుకు నాగమణి విన్నవించారు.
పాతపట్నంలో ‘జగనన్నకు చెబుదాం’కు 123 వినతులు
వినతులు స్వీకరించిన జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ నవీన్