
పొందూరు మండలం రాపాక–దళ్లవలస రహదారి బీటీ రోడ్డు
అరసవల్లి: ఏపీ రూరల్ రోడ్ ప్రాజెక్టు ఉత్తమ ప్రాజెక్టుగా కితాబులందుకుంటోంది. కనీసం 250 మంది జనాభా మించిన గ్రామాలకు కచ్చితంగా బ్లాక్ టాప్ (బీటీ)/సీసీ (సెమెంట్ కాంక్రీట్) రహదారులను నిర్మించాలని ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు కింద ప్రభుత్వం దారులు వేస్తోంది. ఈ రహదారుల నాణ్యత బాగుండడంతో ఉన్నత స్థాయి ప్రతినిధులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ మేరకు తాజాగా బ్యాంకు ఇంప్లిమెంటేషన్ సపోర్టు మిషన్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏపీఆర్‌ఆర్ ప్రాజెక్టును ఉత్తమ ప్రాజెక్టుగా గుర్తించాయి. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సాయంతో రూరల్ ప్రాంతాలకు రహదారుల నిర్మాణానికి గత ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటికీ ఆశించిన మేరకు పనులు రోడ్డెక్కలేదు. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా నాలుగు ప్యాకేజీలుగా రహదారులు నిర్మాణానికి ప్రతిపాదించారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు కాంట్రాక్ట్‌లు దక్కించుకునే వ్యవహారంపైనే దృష్టి పెట్టిన అప్పటి ప్రభుత్వం నేతలు రహదారుల నిర్మాణాలను గాలికి వదిలేసింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3665 రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో మొత్తం ఏఐఐబీ–1ఎ కింద 312 పనులు, ఏఐఐబీ–1బి కింద 83 పనులను గుర్తించి రహదారులను నిర్మాణానికి చర్యలు చేపట్టింది.
2019 తర్వాతే..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏఐఐబీ ప్యాకేజీ కింద గ్రామీణ రహదారుల నిర్మాణాల పనులు 2019 తర్వాత ఊపందుకున్నాయి.
● జిల్లాలో ప్యాకేజీ–1 కింద పాలకొండ,
ఆమదాలవలస, పాతపట్నం,
● ప్యాకేజీ–2 కింద ఎచ్చెర్ల, రాజాం
● ప్యాకేజీ–3 కింద పలాస, ఇచ్ఛాపురం
● ప్యాకేజీ–4 కింద శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాలు చొప్పున మొత్తం 395 రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదించారు.
ఈ మేరకు ఏఐఐబీ –1ఎ కింద ప్రతిపాదించిన 312 పనులను 484.43 కిలోమీటర్లకు రూ.352.78 కోట్లు అంచనాతో బీటీ రోడ్లు మంజూరు కాగా, ఇందులో 266 రహదారులు పలు దశలుగా నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. దీంతో ప్రస్తుతం వరకు రూ.65.59 కోట్లు ఖర్చు కాగా, 102.71 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. అలాగే ఏఐఐబీ –1బి కింద ప్రతిపాదించిన 83 పనులు 205.68 కిలోమీటర్లకు రూ.46.92 కోట్ల అంచనాతో బీటీ రోడ్లు మంజూరు కాగా, ఇందులో 12 రోడ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. 71 పనుల కేటాయింపు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి.

కోటబొమ్మాళి మండలం వింజామపాడు గ్రామానికి జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణం

పోలాకి మండలం గోకయ్యవలస గ్రామానికి వేసిన సీసీ రోడ్డు