
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఐద్వా నాయకులు
వజ్రపుకొత్తూరు రూరల్: దేశంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 5న ఢిల్లీలో జరగనున్న నారీభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఐద్వా నాయకురాలు శ్రీదేవి పాణిగ్రహి పిలుపునిచ్చారు. మండలం నగరంపల్లిలో గురువారం దీనికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేయాలని పోరాడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అభ్యుదయ మహిళ జర్నలిస్టులు, రచయిత్రులపై వేధింపులు అధికమయ్యాయని, మహిళల కు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు బి.సుగుణ, ఎస్.ఈశ్వరమ్మ, ఎస్.సరోజిని, బి.లక్ష్మి, పారమ్మ తదితరులు ఉన్నారు.