
ప్రవీణ్‌కుమార్ (ఫైల్)
ఎచ్చెర్ల క్యాంపస్: పంచాయతీలకు సంబంధించి పూర్తిస్థాయి పాలనాంశాలపై పట్టు అవసరమని పంచాయతీరాజ్ అసిస్టెంట్ కమిషనర్ ఇ.కృష్ణమోహన్ అన్నారు. ఎచ్చెర్లలోని జిల్లా సాంకేతిక శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శుల నాలుగో విడత శిక్షణ కార్యక్రమానికి ఆయన గురువారం హాజరై మాట్లాడారు. ప్రధానంగా పాలన, పంచాయతీ రాజ్ చట్టాలు, గ్రామాల్లో లే అవుల్ ఏర్పాటు, అనుమతులపై అవగాహన అవసరమని చెప్పారు. ప్రస్తుతం గ్రామ సచివాలయ వ్యవస్థలో గ్రామ కార్యదర్శుల పాత్ర కీలకమని వివరించారు. కార్యక్రమంలో డీపీఆర్‌సీ డీసీ పి.వి.రాజు, డీటీఎం ఎస్.లోకనాథ్ పాల్గొ న్నారు.
మురసం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రఫీ
శ్రీకాకుళం కల్చరల్: ముస్లిం రచయితల సంఘం (మురసం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక వినుకొండలో జరిగింది. వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కవి కరీముల్లా పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికలో రాష్ట్ర అధ్యక్షుడిగా అబ్దుల్ హకీమ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రముఖ కవి మహ్మద్ రఫీ(ఈవేమన) ఎన్నికయ్యారు. ఈ మేరకు సహాయ కార్యదర్శి రఫీ ఓ ప్రకటనలో తెలిపారు. మత సామరస్యం, సామాజిక, సాహిత్య చైతన్యం, తెలుగు భాషా భివృద్ధి వంటి లక్ష్యాలతో భారత రాజ్యాంగ విలువలకు కట్టుబడి ముస్లిం రచయితల సంఘం పనిచేస్తుందని తెలిపారు.
తాడివలస కార్యదర్శిపై విచారణ
పొందూరు: తాడివలస కార్యదర్శి వెంకటరావు ఇంటి పన్నులు పంచాయతీ ఖాతాకు జమచేయకుండా అవకతవకలకు పాల్పడ్డారంటూ తాడివలస గ్రామానికి చెందిన సీహెచ్ లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీడీఓ సీపాన హరిహరరావు గురువారం విచారణ జరిపారు. ఇంటిపన్నులు వసూలు చేసి పంచాయతీ బిల్లులు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. విచారణ పూర్తి నివేదికలను ఉన్నతాధికారులకు అందస్తామని ఎంపీడీఓ చెప్పారు.
తానా కవయిత్రుల
సమ్మేళనానికి ‘మీనాక్షి’
శ్రీకాకుళం కల్చరల్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఈ నెల 24న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నారీ సాహిత్య భేరీ అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనం కార్యక్రమానికి పొందూరు మండలం గోకర్ణపల్లికి చెందిన తెలుగు అధ్యాపకురాలు, హరికథా భాగవతారిణి రోణంకి మీనాక్షిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో ఇంతటి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో కవిత్వం వినిపించడానికి తనకు విశిష్టమైన స్థానం కల్పించిన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ టి.ప్రసాద్, సమన్వయకర్త చిరుగురుమళ్ల శ్రీనివాస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. మన దేశంతోపాటుగా 15 దేశాల కవయిత్రులు, రచయితలు, ప్రముఖ సాహిత్య మహిళలు పాల్గొంటారని తెలిపారు.
బీచ్‌లో గల్లంతైన ప్రవీణ్ మృతి
ఆమదాలవలస, పోలాకి: ఆమదాలవలస మున్సిపాలిటీ 2వ వార్డు కృష్ణాపు రం గ్రామానికి చెందిన కూన ప్రవీణ్‌కుమార్ అలియాస్ పవన్ (15) మంగళవారం కళింగపట్నం బీచ్‌లో సముద్రంలోకి దిగి గల్లంతయ్యాడు. గురువారం సాయంత్రం పోలాకి మండలం రాజారాంపురం గ్రామం సముద్ర తీరానికి ఒక మృతదేహం కొట్టుకురావడంతో దాన్ని మృతుని తల్లి కూన ఉషారాణి, బంధువులు చూసి గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. యువకుడి మృతితో కృష్ణాపురంలో విషాధచాయలు అలుముకున్నాయి.
‘విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీల్లేదు’
ఆమదాలవలస: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాలు జరిపేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దాన్ని అమ్మేందుకు వీల్లేదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోకనాథం అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉక్కురక్షణ యాత్ర బైక్ ర్యాలీ ఆమదాలవలస పట్టణంలోకి గురువారం రాత్రి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని గేటు ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి కష్ట నష్టాలు, కార్మికులకు కలిగే నష్టాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దుప్పల గోవిందరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.జనార్ధనరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అమ్మిన్నాయుడు, కార్యదర్శి పి.తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రోణంకి మీనాక్షి