
పలువురు సాహితీవేత్తలు, కళాకారులకు సత్కారాలు
● పాతికేళ్లుగా సాహితీ సేవలో మహతి సంస్థ
● ఏటా లబ్ధప్రతిష్టులకు సాహితీ సత్కారాలు
● రూ.6లక్షల వరకు పలు సేవా సంస్థలకు ఆర్థిక సాయం
● నేడు మహతి రజనోత్సవం
శ్రీకాకుళం కల్చరల్: మహతి.. పాతికేళ్లుగా సాహితీ సేవ చేస్తున్న సంస్థ. ఎప్పుడో 1998లో డాక్టర్ ఈశ్వర సత్యనారాయణ ధన్వంతి ఆధ్వర్యంలో దూసి ధర్మారావు కార్యదర్శిగా ప్రముఖ సినీనటులు రావికొండలరావు, రాధాకుమారిలు ముఖ్య అతిథులుగా ఈ సంస్థను ప్రారంభించారు. నాటి నుంచి పండితుల ఉపన్యాసాలు, సంగీత కార్యక్రమాలు, ఘంటసాల ఆరాధనోత్సవాలు వంటివి నిర్వహించడం ద్వారా ఎందరో ఔత్సాహిక కళాకారులకు అవకాశాలు కల్పిస్తున్నారు.
ఏటా విశిష్ట సాహితీ పురస్కారం
సంస్థ ఏర్పడిన నాటి నుంచి విశిష్ట సాహితీ పురస్కారాలను, రూ.5వేలు నగదు పారితోషికం అందిస్తోంది సంస్థ. అలాగే పలువురు కళాకారులకు, సాహితీ వేత్తలకు సత్కారాలను కూడా చేస్తున్నారు. మొదటిగా గొల్లపూడి మారుతీరావుతో ప్రారంభించిన పురస్కారాలు సామవేదం షణ్ముఖశర్మ, మల్లాజోస్యు ల శ్రీమన్నారాయణ, గరికపాటి నరసింహారావు(సహస్రావధాని), మానప్రగడ శేషసాయి, ఆచార్య మల యవాసిని, కాళీపట్నం రామారావు మాస్టారు, ఆరవెల్లి లక్ష్మీనారాయణాచార్యులు, భరత్ శర్మ, సంగీతావధాని మీగడ రామలింగస్వామి, కళాప్రవీణ బండారు చిట్టిబాబు, డాక్టర్ సనపల నారాయణమూర్తి, ఎల్లాప్రగడ రామకృష్ణ, హరికథకులు మండా కమలకుమారి, శలాక రఘునాధశర్మ, మానేపల్లి సత్యన్నారాయణ, అమరాపు సత్యం వంటి వారికి విశిష్ట పురస్కారాలను అందించారు. ఈ ఏడాది అష్టావధానికి పైడి హరనాథరావుకు అందించనున్నారు.
సేవలు, ఆర్థిక సాయాలు
వీటితో పాటుగా ఉచిత మెడికల్ క్యాంపులు వంటి సేవా కార్యక్రమాలు, సామాజిక సేవా సంస్థలకు ఆర్థిక సాయాలు కూడా అందజేశారు. ప్రశాంతి వృద్ధజనాశ్రమానికి రూ.1 లక్ష, రెడ్‌క్రాస్ అనురాగ నిలయానికి రూ.1లక్ష, బెహరామనోవికాస కేంద్రానికి రూ.50వేలు, అమ్మ ఫౌండేషన్‌కు రూ.50వేలు, రంగస్థల కళాకారుల సమాఖ్యకు రూ.25వేలు, సత్యసాయి ఉచిత అన్నదాన కార్యక్రమానికి రూ.50 వేలు, మూగచెవిటి పాఠశాలకు రూ.25వేలు, ఉపనిషన్మందిరానికి రూ.2లక్షలు ఆర్థికంగా సాయం చేశారు. పేదలకు, అనాథలకు, సీ్త్రసదన్, బాలసదన్, బెహరామనోవికాస కేంద్రం, లెప్రసీకాలనీ, శిశు సదన్‌లలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ప్రతినెల రూ.200లు పేద కళాకారులకు పించను అందిస్తున్నారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ 10మంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించారు. అరసవల్లిలో నిర్వహిస్తున్న బ్రాహ్మణ ఉచిత భోజన సత్రానికి రూ.10వేలు విరాళంగా ఇచ్చారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన గాయనీగాయకులకు, నటులకు హరికథకులకు, నాట్య కళాకారులకు, సాహితీ వేత్తలు, సేవా తత్పరులు, వైద్యులను సత్కరించారు.
నేడు రజతోత్సవం
సంస్థ ఏర్పడి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఉపనిషన్మందిరంతో కలసి మహతి రజతోత్సవాలను నిర్వహిహిస్తున్నారు. ప్రముఖ అష్టావధాని పైడి హరనాథరావుకు మహతి విశిష్ట సాహితీ పురస్కారాన్ని, రూ.5వేలు నగదు పారితోషికాన్ని అందించనున్నారు.
తండ్రి ఆశయం మేరకు..
మా నాన్న ఏర్పాటు చేసిన ఈ సంస్థను నేను కన్వీనర్‌గా కొనసాగిస్తున్నాను. ఆయన ఆశయాలను కొనసాగిస్తు ప్రతి ఏడాది లబ్ధి ప్రతిష్టులకు పురస్కారాలను, ఉచిత మెడికల్ క్యాంపులు వంటి పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నాం.
– డాక్టర్ ఈశ్వర సూర్య సంపత్‌కుమార్,
మహతి సంస్థ కన్వీనర్
