
మాట్లాడుతున్న ఏపీఎస్‌ఐఆర్‌డీ డైరెక్టర్ మురళి
పలాస: వంశధార అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ నుంచి మెమో జారీ అయ్యిందని పలాస ఎంపీపీ ఉంగ ప్రవీణ చెప్పారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వంశధార అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రికి లేఖ రాశానని, అందుకు సీఎం స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. కొన్నేళ్లుగా పలాస, వజ్రపుకొత్తూరు మండలాల శివారు ప్రాంతాలకు నీరు రావడం లేదని, అయినా అధికారులు ఉన్నతాధికారులకు నీరు ఇస్తున్నట్టు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు రైతులకు సాగు నీరు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
సమన్వయంతోనే
ఉత్తమ ఫలితాలు
అరసవల్లి: గ్రామీణాభివృద్ధిలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు సమన్వయంగా పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని ఏపీ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జె.మురళి అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కార్యదర్శుల రీఫ్రెషర్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 రోజుల శిక్షణలో భాగంగా ప్రతి కార్యదర్శి ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న మెలకువలను, నిబంధనలను వినియోగించుకుని గ్రామ పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సమన్వయం చేసుకుని లక్ష్యాలను శతశాతం చేరుకోవాలని సూచించారు. ధ్యానం ద్వారా ఒత్తిడిని జయించే అవకాశముంటుందన్నారు. కార్యక్రమంలో పీఆర్ అసిస్టెంట్ కమిషనర్ ఇ.కృష్ణమోహన్, హార్ట్‌ఫుల్ సంస్థ ప్రతినిధి లక్ష్మణరావు, డీఎల్‌పీఓ గోపిబాల, ఐ.వి.రమణ, డి.పి.ఆర్.సి. జిల్లా కోఆర్డినేటర్ పి.వి.రాజు, డీటీఎం లోకనాథం తదితరులు పాల్గొన్నారు.