
వినతులు అందజేస్తున్న ఫిర్యాదుదారులు
రణస్థలం: కొవ్వాడ అణువిద్యుత్‌తో పాటు ఇతర సమస్యలు పదేపదే పునరావృతం అవుతున్నాయని, అలా కాకుండా పరిష్కరించాల్సిన బాధ్యత మండల స్థాయి అధికారులపై ఉందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, జేసీ ఎం.నవీన్ అన్నారు. రణస్థలం మండల పరిషత్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం మండల స్థాయి స్పందన కార్యక్రమం జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల వద్దకు ఫిర్యాదుదారులు వచ్చినప్పుడు సమస్య ఎందుకు పరిష్కారం కాలేదో వివరంగా చెప్పాలన్నారు. అంతేతప్ప పదేపదే ఫైల్ తిప్పడం సరికాదన్నారు. అనంతరం రెవెన్యూ శాఖకు సంబంధించి 30, సివిల్ సప్లయ్ 4, కొవ్వాడ అణువిద్యుత్ 33, పంచాయతీరాజ్ 35, గృహ నిర్మాణశాఖ 7, విద్యుత్‌శాఖ 10, ఉపాధి హామీ 1, ఆరోగ్యశాఖ 1, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ 1 చొప్పున మొత్తం 122 సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్టు నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన పూర్తిగా నిలిచిపోవడంతో రోడ్డు అధ్వానంగా మారిందని, విద్యుత్, పరిహారం వంటి సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. తోటపల్లి కాలువ పెండింగ్ పనులు పూర్తి చేయాలని, కమ్మసిగడాం దేవరాపల్లి రోడ్డు పునర్నిర్మించాలని, ఎన్‌హెచ్–16 నుంచి బండిపాలెం రహదారి మరమ్మతులు చేయాలని, పాతర్లపల్లి నుంచి దేరసాం, జీరుపాలెం నుంచి గోసాం వరకు, బొంతుపేట నుంచి మహంతిపాలెం వరకు రోడ్డు బాగు చేయాలని, రణస్థలం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వినతిపత్రాలు అందజేశారు. జె.ఆర్.పురం పంచాయతీలోని వెంకటేశ్వర కాలనీలో కాలువ సమస్యలతో పాటు, మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, ఆర్డీవో బొడ్డేపల్లి శాంతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి.మురళీకృష్ణ, జయదేవి, డీఆర్‌డీఏ పీడీ విద్యాసాగర్, జెడ్పీ సీఈవో ఆర్.వెంకటరామన్, డీపీఓ వి.రవికుమార్, డీఎల్‌డీఓ వాసుదేవరావు, ఏపీసీ రొణంకి జయప్రకాష్, డ్వామా పీడీ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
‘జగనన్నకు చెబుదాం’లో
ఇన్‌చార్జి కలెక్టర్ ఎం.నవీన్