
శ్రీకాకుళం రూరల్: అరసవల్లిలోని శ్రీలక్ష్మీగార్డెన్స్‌లో నివాసముంటున్న సదాశివుని రాజేష్ (38) గురువారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన బలరామ్ హిమల్, అప్పలరాజు గార మండలం జొన్నలపాడులో నివాసముంటూ ఖాజీపేట పరిసర ప్రాంతంలో కొద్ది నెలలుగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ప్రతిరోజూ రాత్రి నాగావళి నది నుంచి టైరుబండి ద్వారా ఇసుకను తీసుకొస్తూ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తుండేవారు. ఈ క్రమంలో ఒప్పంగిలో బేరం కుదరడంతో గురువారం రాత్రి 12 గంటల సమయంలో వీరిద్దరూ రెండు వేర్వేరు టైరుబళ్లు ద్వారా ఇసుకను తీసుకెళ్తున్నారు.
ఈ సమయంలో అరసవల్లికి చెందిన సదాశివుని రాజేష్ అడ్డగించాడు. ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారని, అనుమతులు ఎవరు ఇచ్చారని వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయాన్ని స్నేహితులకు ఫోన్‌లో వివరించాడు. ఈ క్రమంలో అప్పలరాజు ముందుగా వెళ్లిపోయాడు. వెనుకనే ఉన్న బలరామ్ హిమల్ తనతో తీవ్ర వాదనకు దిగిన రాజేష్‌ను కిందకు నెట్టేసి టైరుబండితో పైనుంచి ఎక్కించుకుపోయాడు.
ఈ ఘటనలో రాజేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈలోగా అక్కడికి చేరుకున్న స్నేహితులు రక్తపు మడుగులో ఉన్న రాజేష్‌ను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాజేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు ఆపరేటివ్ డ్రైవర్‌గా పనిచేయగా, భార్య ఇందు ఉన్నారు.. మృతుడి తండ్రి కాశీనాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బలరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు.