
ఘటనా స్థలం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు
ఆమదాలవలస : పట్టణంలోని రైల్వేస్టేషన్ జంక్షన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక లక్ష్మీనగర్ వీధికి చెందిన శాంతామణి టెక్స్‌టైల్స్ వ్యాపారి అమనాన శాంతారావు(72) మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి కూరగాయలు తీసుకువస్తానని సైకిల్‌పై బయల్దేరి వెళ్లిన శాంతారావును కొత్తూరు నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఓవైపు ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు జరుగుతుండటం, అక్కడికి వచ్చిన వాహనదారులు రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేసి ఉండటం, డ్రైవర్ ఒక్కసారిగా కుడివైపున బస్సును నడిపించడంతో శాంతారావు బస్సు వెనుక చక్రం కింద పడి తల నుజ్జనుజ్జయ్యింది. మృతుడికి భార్య జయభారతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలయ్యాయి. ఆమదాలవలస ఎస్‌ఐ వై.కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. శాంతారావుకు ఆమదాలవలస నియోజకవర్గంలో మంచి వ్యాపారిగా పేరు ఉంది. ఈయన మృతి పట్ల ఆమదాలవలస క్లాత్ అండ్ రెడీమేడ్ వస్త్ర వ్యాపారుల సంఘం నాయకులు జె.కె.వెంకటేశ్వరరావు, కె.శ్యాంప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు.
రోడ్డుపైన వ్యాపారాల వల్లే..
ఇరుకై న రహదారిలో రోలింగ్ నిర్మాణం, ఫుట్‌పాత్ వ్యాపారులు రహదారిపైకి వచ్చి వ్యాపారం చేయడం వంటి కారణాల వల్ల ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.పోలీసులు, మున్సిపల్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

శాంతారావు (ఫైల్)