గురువుల బదిలీలకు

బదిలీల షెడ్యూల్ ఇదీ..
● ఈ నెల 24 నుంచి 26 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
● ఆన్‌లైన్లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 25 నుంచి 27 వరకు పరిశీలించనున్నారు.
● ఈ నెల 28, 29 తేదీల్లో ప్రొవిజనల్ సీనియార్టీ జాబితాలను ప్రదర్శిస్తారు.
● జాబితాలో పొరపాట్లు, తప్పులుంటే ఉపాధ్యాయులు అభ్యంతరాలు చేసుకునేందుకు 30న అవకాశం కల్పించారు.
● ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో అభ్యంతరాలు పరిష్కరిస్తారు
● జూన్ 2, 3వ తేదీల్లో టీచర్లకు పాయింట్లను బట్టి వెబ్‌సైట్‌లో తుది సీనియార్టీ జాబితాలను ఉంచుతారు.
● జూన్ 4న ఖాళీలు ప్రదర్శించనున్నారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: గురువుల బదిలీలకు వేళయింది. రెండేళ్ల వ్యవధిలో రెండోసారి ఉపాధ్యాయుల ట్రాన్స్‌ఫర్లకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే మార్గదర్శకాల వెలువడి షెడ్యూల్ కూడా ప్రకటించడంతో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. స్వీయ ధ్రువీకరణ చేసిన వాటిని మాత్రమే ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
వెబ్‌ఆప్షన్స్‌కు చాన్స్..
హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు ఆన్‌లైన్ ద్వారా వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకునేందుకు జూన్ 5 నుంచి 8వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో హెచ్‌ఎంలకు 5 నుంచి ఆరో తేదీ వరకు అవకాశం కల్పించగా.. స్కూలు అసిస్టెంట్లకు 5 నుంచి 7వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్లకు జూన్ 5 నుంచి 8 వరకు ఆన్‌లైన్ ద్వారా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. జూన్ 9న ప్రధానోపాధ్యాయులు, స్కూలు అసిస్టెంట్లలో బదిలీలు అయిన వారి జాబితాలను విడుదల చేయనున్నారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీల జాబితాలను 9 నుంచి 11 వరకు విడుదల చేసేలా మార్గదర్శకాలు వెలువరించింది.
ఆధారాలు చూపించాల్సిందే..!
బదిలీలు అయ్యేవారు ప్రిఫరెన్షియల్ కేటగిరిలో ఉన్నట్టయితే అటువంటి వారు ఆధారాలను పరిశీలనకు ముందు ధ్రువీకరణ పత్రాలు అందించాల్సి ఉంటుందని విద్యా శాఖాధికారులు పేర్కొన్నారు. మెడికల్‌కు సంబంధించి రిమ్స్ మెడికల్ హాస్పటల్ బోర్డు ధ్రువీకరించాల్సి ఉంటుంది. స్పౌజ్‌కు సంబంధిత పాఠశాల హెచ్‌ఎం ధ్రువీకరణ చేయాలి. ఆన్‌లైన్‌లో ఇప్పటివరకు 950 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య తెలిపారు. జీవో సర్వీస్‌కు కూడా రిక్వెస్ట్ బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ సూచిస్తున్నారు.
పాఠాల బోధనలో ఓ టీచర్
రెండేళ్ల వ్యవధిలో మరోసారి
ట్రాన్స్‌ఫర్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
25 నుంచి దరఖాస్తుల పరిశీలన
జూన్ 2, 3 తేదీల్లో తుది జాబితాలు