సాక్షి, పుట్టపర్తి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో అలజడి రేగింది. సిబ్బంది మధ్య రోజుకో తగాదా వెలుగు చూస్తోంది. మాటా మాట పెరిగి పెద్ద గొడవకు దారి తీస్తోంది. వీధి రౌడీల తరహాలో సిబ్బంది కార్యాలయంలోనే తన్నుకోవడం కలకలం రేపుతోంది.
కార్యాలయంలోనే దాడులు..
జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో రెండు రోజుల క్రితం ఓ సూపరింటెండెంట్‌తో సీనియర్ అసిస్టెంట్ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మిగతా సిబ్బంది సర్దిజెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది. మరుసటి రోజు ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరూ భౌతిక దాడులు చేసుకున్నారు. ఆ సమయంలో ఫీల్డ్‌కు వెళ్లిన డీఎంహెచ్‌ఓ..ఆ తర్వాత ఇద్దరినీ పిలిచి మందలించారు.
ఎవరికి వారే యమునాతీరే
వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని ఉద్యోగులు ఎవరికి వారే యమునా తీరేలా వ్యవహరిస్తుంటారు. ఏదైనా పని చేయాల్సి వస్తే.. ఒకరిపై మరొకరు నెట్టేకునే క్జ్రమంలో మాట్లాడే ధోరణి కారణంగా ప్రతిసారీ గొడవ జరుగుతున్నట్లు తెలిసింది. గొడవకు కారణం అవుతున్న వారందరూ ఐదు పదుల వయసు దాటిన ఉద్యోగులే ఉండటం గమనార్హం. కార్యాలయంలో సిబ్బంది మధ్య జరిగిన గొడవల గురించి డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగంను వివరణ కోరగా.. సిబ్బంది గొడవ పడిన మాట వాస్తవమేనన్నారు. సదరు సిబ్బందిని పిలిచి మందలించడంతో పాటు ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించానన్నారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
సిబ్బంది మధ్య తరచూ తగాదాలు
వీధి రౌడీల్లా తన్నుకుంటున్న సిబ్బంది


