పుట్టపర్తి అర్బన్: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొత్తచెరువులోని నారాయణ పాఠశాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పాఠశాలలో పుస్తకాలు, యూనిఫాం విద్యార్థులకు విక్రయిస్తుండగా బుధవారం ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి శేషం మహేంద్ర ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు అడ్డుకున్నారు. పాఠశాల ఎదుట బైఠాయించి ఎంఈఓ సోమశేఖర్ ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎంఈఓ పాఠశాలకు వచ్చి పాఠశాలలోని గదిని సీజ్ చేశారు. పుస్తకాలు, యూనిఫాం, షూ, తదితర వస్తువులు పాఠశాలల్లో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యువ రైతు ఆత్మహత్య
ధర్మవరం రూరల్: మండలంలోని దర్శనమలలో బుధవారం మందల ఆంజనేయులు(35) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, ధర్మవరం రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. ఆంజనేయులు తనకున్న మూడు ఎకరాల్లో వేరుశనగ, కాయగూరల సాగు చేసేవాడు. పంటలకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు కూడా వచ్చేవి కావు. ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.5 లక్షల దాకా అప్పులు చేశాడు. వీటిని తీర్చే మార్గం కానరాక బుధవారం పొలంలో చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలానికని వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు అక్కడికి వెళ్లి చూడగా... విషయం వెలుగు చూసింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి..కేసు నమోదు చేశారు.


