● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
పెనుకొండ రూరల్: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. అందులో భాగంగానే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఇటీవల ప్రకాశ్ రెడ్డి భద్రతా సిబ్బందిని కూడా కక్షపూరితంగా తొలగించారన్నారు. అక్రమ అరెస్టులతో వైఎస్సార్ సీపీ శ్రేణులను భయపెట్టలేరని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారని ఆమె తెలిపారు.
విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక సాయం
ప్రశాంతినిలయం: ప్రపంచంలోని టాప్ 500 విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ చదువుకునేందుకు ఆర్థిక సాయం అందించే నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీంకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. షెడ్యూల్డ్ కులాలు, డీ నోటిఫైడ్ సంచార తెగలు, సెమీ సంచార తెగలు, భూమి లేని వ్యవసాయ కార్మికులు, సంప్రదాయ కళాకారుల వర్గాల్లో తక్కువ ఆదాయం కలిగిన వారి పిల్లలు ఇందుకు అర్హులు. ఈ పథకం కింద 125 కొత్త స్కాలర్‌షాప్‌లు మంజూరవుతాయి. https:// nosmsje.gov.in ద్వారా జూన్ 2లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే చేసిన దరఖాస్తుల్లో సవరణలకు జూన్ 4 నుంచి 7వ తేదీ వరకూ అవకాశం కల్పించారు.
55 మంది మంది గైర్హాజరు
పుట్టపర్తి: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాల్లో హిందీ పరీక్ష జరిగిందని డీఈఓ కిష్టప్ప పేర్కొన్నారు. 200 మందికి గానూ 200 మంది హాజరుకాగా, 20 మంది గైర్హాజరయ్యారన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షల్లో 106 మందికి గాను 71 మంది హాజరు కాగా 35 మంది గైర్హాజరయ్యారన్నారు. మొత్తంగా 55 మంది గైర్హాజరైనట్లు వివరించారు.
ఇంటర్ పరీక్షల్లో 127 మంది...
పుట్టపర్తి: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 127 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. జిల్లాలోని 32 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. జనరల్ విద్యార్థులకు బయాలజీ, గణితం ఒకేషనల్ విద్యార్థులకు పేపర్–3 పరీక్ష జరిగింది. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు 1,263 మందికి గాను 1,195 మంది హాజరు కాగా 68 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 988 మందికి గాను 929 మంది విద్యార్థులు హాజరు కాగా 59 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు.
కడప క్రీడా పాఠశాలలో
ప్రవేశాలకు దరఖాస్తులు
ప్రశాంతినిలయం: కడప క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ చదువుతున్న, క్రీడల పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జూన్ 2వ తేదీ లోపు https://apsportsschool.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారన్నారు.
అనంతలో భారీ వర్షం
అనంతపురం క్రైం: భారీ వర్షం అనంతపురాన్ని అతలాకుతలం చేసింది. సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులకు వృక్షాలు నేలకొరిగాయి. రోడ్లపై చెట్లు పడిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నవోదయ కాలనీలో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణం, లక్ష్మీనగర్, కోవూరునగర్, జీసస్ నగర్, అశోక్‌నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. చెట్టు కొమ్మలు విరిగి పడటంతో లక్ష్మీనగర్‌లో విద్యుత్ స్తంభం నేలకూలింది. జీసస్ నగర్‌లో కూలిన భారీ వృక్షం కారణంగా ప్రభుత్వ సర్వజనాస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


