పడకేసిన వ్యవసాయం | - | Sakshi
Sakshi News home page

పడకేసిన వ్యవసాయం

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

అనంతపురం అగ్రికల్చర్‌: రైతులను మోసపుచ్చడం కష్టం కాదని సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారు. గతంలో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవసాయ రంగాన్ని, రైతులను చాలా చిన్న చూపు చూస్తూ వచ్చినా... ఈసారి ఏదో చేస్తారని ఆశించి నాలుగో సారి కూడా మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘వ్యవసాయం దండగ మారి... ఉచిత విద్యుత్‌ అనేది తీగలపై బట్టలు ఆరేసుకునేందుకే.. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇస్తూపోతే చివరకు ఆ పరిహారం కోసమే చస్తారు... పావలా వడ్డీ వేస్ట్‌... రాయితీలు ఇవ్వకూడదు’ అంటూ గతంలో వ్యవసాయ రంగాన్ని చులకనగా, రైతులను హేళన చేసి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మూడో పర్యాయంలో రుణమాఫీ... నాలుగో సారి సూపర్‌సిక్స్‌, సుఖీభవ అంటూ రైతులను మభ్యపెట్టి వారి ఓట్లతో మరోసారి అధికారంలోకి వచ్చినా.... తన నైజాన్ని ఏమాత్రం మరచిపోకుండా రైతులను దగా చేశారు. ఈ రెండేళ్లలో అరకొరగా సుఖీభవ మినహా ఎటువంటి సాయం చేయకుండా వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలైన పట్టు, పాడి, పశుపోషణ, ఉద్యాన తదితర రంగాలపై ఆధారపడిన రైతులనూ నష్టాల బాట పట్టించారు.

పట్టుపరిశ్రమశాఖ ద్వారా మల్బరీ (రేషం) రైతులకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, బడ్జెట్‌ ఇవ్వకపోవడంతో మల్బరీ విస్తీర్ణం తగ్గుముఖం పడుతోంది. 5 వేల ఎకరాలు ఉందని పట్టుశాఖ అధికారులు చెబుతున్నా... ఈ–క్రాప్‌లో మాత్రం కేవలం వెయ్యి ఎకరాలు మాత్రమే నమోదు కావడం గమనార్హం. రాయితీలు, ప్రోత్సాహం లేక చాలా మంది రెతులు ఇతర పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో పాడి రైతులకు ఎంతో లాభదాయకంగా ఉన్న ‘అమూల్‌ పాలవెల్లువ’ను అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు బలవంతంగా ఆపేశారు. హెరిటేజ్‌ లాంటి ప్రైవేట్‌ డెయిరీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పాల ధరలు పెంచకుండా గత ప్రభుత్వం కన్నా లీటర్‌పై రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించాయి. పశుబీమా లాంటి పథకాలు లేకపోవడంతో పాడి రైతులు, జీవాల కాపర్లు నష్టపోతున్నారు. గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉచిత బీమా పథకం అమలు చేయడంతో పశువులు, జీవాలు చనిపోయిన 8 వేల మంది లబ్ధిదారులకు రూ.26 కోట్ల మేర బీమా పరిహారం దక్కింది.

వర్షాభావంతో ఎండిపోయిన చీనీ చెట్లు

పథకాలు, ప్రోత్సాహకాలు లేక పట్టు రైతుల కుదేలు

పాలవెల్లువను బలవంతంగా ఆపేయడంతో పాడి రైతులకు నష్టం

గిట్టుబాటు ధరల్లేక భారీ నష్టాలు మూటగట్టుకున్న ఉద్యాన రైతులు

చంద్రబాబు పాలనలో అడుగడుగునా దగా పడుతున్న అన్నదాతలు

‘ఎల్‌–నినో’ పేరుతో భయపెడుతున్న సర్కార్‌

నష్టాల్లో ఉద్యాన రైతులు

ఫ్రూట్‌బౌల్‌ ఆఫ్‌ ఏపీగా, ఉద్యానహబ్‌గా పిలవబడుతున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2020, 2021 రెండేళ్లు కరోనా కష్టాలు మినహా మిగిలి మూడేళ్లు ప్రోత్సాహకం, రాయితీలు, గిట్టుబాటు ధరలు ఉన్నందున రైతులు ఆర్థికంగా గట్టెక్కారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి నిలవడంతో ఉద్యాన రైతులు మనోధైర్యంతో ముందడుగు వేశారు. ఉచిత పంటల బీమాను ఉద్యాన పంటలకు వర్తింపజేయడంతో ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలు వాటిల్లినప్పుడు పెద్ద మొత్తంలో పరిహారం దక్కి నష్టాల ఊబి నుంచి రైతులు బయటపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేశారు. 5 శాతం ప్రీమియం కట్టాల్సిందేనని నిబంధనల పెట్టారు. ప్రధాన ఉద్యాన ఉత్పత్తులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరల కల్పనలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రధానంగా అరటి, చీనీ, టమాట రైతులు చిక్కిపోయారు. ఉద్యాన పంటలు సాగుకు డ్రిప్‌, స్ప్రింక్లర్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. హార్టికల్చర్‌ కాంక్లేవ్‌ అంటూ గతేడాది రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి కార్పొరేట్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నా వాటి ఫలితాలు కనుచూపు మేరలో ఎక్కడేగాని కనిపించడం లేదు. వీటికి తోడు ఈ ఏడాది ‘ఎల్‌–నినో’ వల్ల వర్షాలు గతి తప్పి కరువు పరిస్థితులు తప్పవంటూ రైతులను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం భయాందోళనలకు గురిచేస్తోంది.

పట్టు లేదు, పాడి లేదు:

చంద్రబాబు పాలనలో గత రెండేళ్లుగా వ్యవసాయ, అనుబంధ రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. పైసా బడ్జెట్‌ కేటాయించకపోవడంతో మల్బరీని నమ్ముకున్న రైతులు అవస్థలు పడుతున్నారు. పథకాలు లేక పాడి, పశుపోషణ రైతులకు భారంగా పరిణమించింది. ప్రోత్సాహకాలు లేక జీవాల కాపర్లు సంకట స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాయితీలు, గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్‌ సదుపాయం లేక ఉద్యాన పంటల సాగు అధ్వానంగా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనుబంధ వ్యవసాయ రంగాలు కూడా రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement