పెనుకొండ: మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న అమ్మవారుపల్లి ఒకప్పుడు ఓ కుగ్రామమే. ప్రస్తుతం అక్కడ కియా కార్ల పరిశ్రమ ఏర్పాటైన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచింది. అక్కడ సౌకర్యాలు మెరుగు పడ్డాయి. దేశవిదేశాలకు చెందిన వారి రాకపోకలూ ఎక్కువయ్యాయి. ముడి సరుకు దిగుమతులు, ఉత్పత్తయిన కార్ల ఎగుమతులకు సంబంధించి రోజూ వేలాది వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటోంది. ఈ క్రమంలో అక్కడ శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ, ప్రమాదాలు చోటు చేసుకున్న వెంటనే తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా ఓ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.
గ్రామాభివృద్ధిని ఆకాంక్షిస్తూ...
కియా పరిశ్రమ ఏర్పాటైన తర్వాత పెనుకొండ చుట్టుపక్కల అద్దె భవనాలకు భారీ డిమాండ్ నెలకొంది. ఒక్కో ఇంటికి ఎంత లేదన్నా నెలకు రూ.10 వేలకు పైగానే అద్దె చెల్లించాల్సి వస్తోంది. 2017లో కియా పరిశ్రమ ఏర్పాటు కాగా, సొంత భవనం లేకపోవడంతో 2019లో అద్దె ఇంటిలో పోలీస్ స్టేషన్‌ను నెలకొల్పారు. ఆ సమయంలో పలు అపోహల కారణంగా పోలీసులకు అద్దెకు భవనాన్ని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రైతు వెంకటరెడ్డి ముందుకు వచ్చాడు. వ్యవసాయంపై జీవనం సాగిస్తున్న ఆయన పొలాలు అమ్మవారుపల్లిలోనే ఉండగా, పెనుకొండలో నెలకు రూ.10 వేలు చొప్పున అద్దె చెల్తిస్తూ ఓ ఇంటి పై పోర్షన్‌కు మకాం మార్చాడు.
స్థలం కేటాయించినా.. నిర్మాణం శూన్యం
వెంకటరెడ్డి నుంచి భవనాన్ని అద్దెకు తీసుకున్న పోలీసులు ఇందుకు సంబంధించి నెలకు రూ.4,327 చొప్పున అద్దె చెల్లించేలా 2019 జనవరి నుంచి 2022 వరకూ లీజు అగ్రిమెంట్ రాయించారు. ఆ సమయంలోనే దుద్దేబండ క్రాస్ వద్ద పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించారు. అయితే నాటి నుంచి నేటి వరకూ ఇది కార్యరూపం దాల్చలేదు. ఈ లోపు లీజు అగ్రిమెంట్ ముగియడంతో అదే ఏడాది డిసెంబర్‌లో మరో అగ్రిమెంట్ (2025 డిసెంబర్ 13వ తేదీ వరకు) ను పోలీసులు రాయించారు. ఈ లీజు అగ్రిమెంట్ గడువు ముగిసింది. ప్రస్తుతం తన ఇంటిని అప్పగించాలని వెంకటరెడ్డి పోలీసులను వేడుకుంటున్నాడు. ఇటీవల భార్య ఆరోగ్యం క్షీణించిందని, వయోభారం కారణంగా రోజూ స్వగ్రామానికి వెళ్లి వ్యవసాయ పనులు చూసుకోవడం భారంగా మారిందని వెంకటరెడ్డి వాపోతున్నాడు. ఎంతలా ప్రాధేయపడినా ఫలితం దక్కకపోవడంతో చివరకు 2025, డిసెంబర్ 1న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి వినతిపత్రం అందించాడు. ఈ వినతిపై ఎస్పీ స్పందిస్తూ పెనుకొండ డీఎస్పీ నర్శింగప్పకు రెఫర్ చేశారు. దీంతో వెంకటరెడ్డిని డీఎస్పీ తన కార్యాలయానికి రప్పించుకుని మాట్లాడారు. సమస్య తెలుసుకుని కొన్ని నెలల గడువు కావాలని, ఈ లోపు సరైన భవనం చూసుకుంటామని పేర్కొన్నారు. నెలలు గడుస్తున్నా... నేటికీ తన భవనాన్ని పోలీసులు స్వాధీనం చేయకపోవడంతో పోలీసులు ఇంతలా ఇబ్బంది పెడతారని అనుకోలేదని వెంకటరెడ్డి వాపోతున్నాడు.
బాధితుల పక్షాన నిలిచి వారికి న్యాయం చేయాల్సిన పోలీసులే గతి తప్పారు. ఏళ్లుగా అద్దె భవనంలోని పోలీస్ స్టేషన్‌ను ఖాళీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. వృద్ధాప్యంలో భార్యతో కలిసి సొంతింట్లో నివసించాలనుకుంటున్న వృద్ధుడి ఆశలను అణిచివేస్తున్నారు. ఇది అమ్మవారుపల్లి వెంకటరెడ్డి దీనగాథ.
పోలీసుల తీరుపై వృద్ధుడి ఆవేదన
పీఎస్‌ను ఖాళీ చేసి తన ఇల్లు ఇప్పించాలని వేడుకోలు
కొన్నేళ్లుగా అలుపెరుగని పోరాటం
మాటలతో పోలసుల కాలయాపన


