సాక్షి, పుట్టపర్తి: ‘సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాలతో రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై ఆయన చేస్తున్న కుట్రలను ప్రజా బలంతోనే తిప్పికొడతాం’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. సోమవారం ఆమె అధ్యక్షతన పుట్టపర్తిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, మాలగుండ్ల శంకర్‌నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, వై. విశ్వేశ్వర రెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, డాక్టర్ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను పూర్తి చేసేలా చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. గ్రామ స్థాయి నుంచి ప్రజలను చైతన్యపరిచేలా కార్యాచరణ రూపొందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి కేవలం రాజకీయం చేస్తూ రైతులు, ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో రహస్యంగా చెప్పాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, గ్యాంగ్ రేప్‌లు జరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదని విమర్శించారు. అనంతపురం హనీ ట్రాప్ ఉదంతంలో పోలీసులు ఉండటం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
● మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీలు రాయలసీమకు తేవాలని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంకల్పించారన్నారు. రాయలసీమ ప్రజలంటే చంద్రబాబుకు చులకనభావమని, అందుకే సీమకు రావాల్సిన జలాలను తన స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ దగ్గర తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టుల ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని కొనియాడారు. ఆయన మార్గంలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పయనించారన్నారు. సీఎం చంద్ర బాబు హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయకుండా నీళ్లు వస్తే కొట్టుకుపోయే లైనింగ్ కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయడం బాధాకరమన్నారు. బాబు ఏనాడూ నీటి ప్రాజెక్టుల విషయంలో న్యాయం చేయలేదని, అక్కడ కూడా రాజకీయమే చేశాడని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ప్రజాబలంతోనే కూటమి
కుట్రలను తిప్పికొడతాం
‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్’ ఆగితే
లక్షల మందికి అన్యాయం
నీటి హక్కుల కోసం గ్రామ స్థాయి నుంచి పోరాటం
మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, ఉషశ్రీచరణ్
పుట్టపర్తిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో
రౌండ్ టేబుల్ సమావేశం
సీఎం చంద్రబాబు తీరుపై నేతల ధ్వజం


