పుట్టపర్తి: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను వెంటనే ప్రారంభించడంతో పాటు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి కాలువ పనులను పూర్తి చేయాలనే డిమాండ్‌పై సోమవారం పుట్టపర్తిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి క్యాంప్ కార్యాలయలలో సమావేశం ఉంటుందన్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్, పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు రమేష్‌రెడ్డి, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతారని తెలిపారు.
నేడు పరిష్కార వేదిక
ప్రశాంతినిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు సమర్పించవచ్చన్నారు.
పోలీస్ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని సూచించారు.ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు.
జనగణనలో
భాగస్వాములు కండి
హిందూపురం: జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. వ్యక్తిగత జనగణన ప్రక్రియపై ప్రజల్లో చైతన్యం కల్పించడంలో భాగంగా ఆదివారం హిందూపురంలో 5కే రన్ నిర్వహించారు. కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ సర్కిల్ నుంచి ప్రధాన వీధుల గుండా తెలుగు తల్లి విగ్రహం వరకు సాగిన రన్‌లో పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ స్వీయగణనను తొలిసారి ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమన్నారు. వందశాతం జనగణన పూర్తి చేయడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించే ప్రణాళికలు, లాభదాయకమైన ప్రయోజనాలకు ఈ గణాంకాలే మూలాధారమన్నారు. తొలి దశలో గృహాల వివరాలు నమోదు చేస్తారని,2027 ఫిబ్రవరిలో కుటుంబ సభ్యుల వివరాలు, కులాల వివరాలు సేకరిస్తారని చెప్పారు. జనాభా గణనపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డీఎస్పీ మహేష్, తహసీల్దార్లు వెంకటేశు, మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ ఉద్యోగికి విద్యుత్ షాక్
రొద్దం: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సచివాలయ ఉద్యోగి వై.శ్రీనివాసులు (40) విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు... మండలంలోని కలిపి గ్రామ సచివాలయంలో గ్రేడ్–2 జేఎల్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఎస్సీ కాలనీలోని ఓ ఇంటి వద్ద విద్యుత్ వైర్లకు మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని 108 వాహనంలో పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించినట్లు తెలిపారు.


