పుట్టపర్తి: ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ (మూల్యాంకనం) ప్రారంభమైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా కొత్తచెరువు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 169 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 33 మంది చీఫ్ ఎగ్జామినర్లు, ఐదుగురు అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు మూల్యాంకన విధుల్లో ఉంటారన్నారు. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, హిస్టరీ, ఎకనమిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల వాల్యుయేషన్ ప్రారంభమైందన్నారు. మొత్తం 1,09,715 పేపర్లు వచ్చాయన్నారు. ఇంగ్లిష్ సబ్జెక్టుకు అధికంగా పేపర్లు వచ్చాయన్నారు. బోర్డు ఆర్డర్ వచ్చిన అన్ని కళాశాలల అధ్యాపకులు వాల్యుయేషన్‌కు హాజరుకావాలని, రాని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరు మృతి
కనగానపల్లి: మండల పరిధిలోని తగరకుంట గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు... మండలంలోని నెమలివరం గ్రామానికి చెందిన బొమ్మలాట గంగాధర్ (35), భాస్కర్, రాజు ముగ్గురు తగరకుంట నుంచి కనగానపల్లి వైపు ద్విచక్ర వాహనంలో వస్తున్నారు. అలాగే కనగానపల్లి వైపు నుంచి అటుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నుంచి కిందపడి ముగ్గురూ గాయపడ్డారు. స్థానికులు గుర్తించి క్షతగాత్రులను 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన గంగాధర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య సుశీల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రమాదంపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ముదిగుబ్బలో మరొకరు..
ముదిగుబ్బ: మండల పరిధిలోని దొరిగిల్లు వద్ద ఆదివారం ద్విచక్ర వాహనం అదుపు తప్పి రాము (52) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పుట్టపర్తికి చెందిన రాము పని నిమిత్తం వెళ్తుండగా దొరిగిల్లు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. తీవ్రంగా గాయపడిన రామును చికిత్స నిమిత్తం ముదిగుబ్బకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య చెన్నమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
పెద్దమ్మ ఆలయంలో చోరీ
పుట్లూరు: మండలంలోని కుమ్మనమల గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలో ఉన్న 60 తులాల వెండి ఆభరణాలను దొంగలు అపహరించినట్లు గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సురేంద్రబాబు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


