నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక
ప్రశాంతినిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పీజీఆర్‌ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పోలీస్ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని, ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు.
రాయదుర్గంటౌన్: రాయదుర్గం పట్టణ సమీపంలోని కొండపై రస సిద్ధేశ్వరస్వామి సిడిమాను ఉత్సవం ఆదివారం సాయంత్రం అశేష భక్తజన సందోహం నడుమ కనులపండువగా జరిగింది. సాయంత్రం ఆరు గంటలకు సిడిమానుకు బాలుడిని కట్టి తిప్పారు. అంతకుముందు ఉత్సవ విగ్రహానికి గంగపూజ నిర్వహించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు మున్సిపల్ సీనియర్ అకౌంటెంట్ ఈశ్వర్ స్నేహితుల బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
జైన సంస్కృతికి ప్రతీక..
శ్రీరస సిద్ధేశ్వర స్వామి ఆలయానికి ప్రాచీన చరిత్ర ఉంది. జైన సంస్కృతికి ప్రతీకగా రససిద్ధేశ్వర స్వామి ఆలయంలో శిలలపై జైన విద్యా పీఠ రూపం మలచబడి ఉంది. మొదటి వరుసలో ఆచార్యులు విద్యార్థులకు బోధిస్తున్న దృశ్యం, ఆ తరువాత రాణులు కూడా ఆచార్యుల ఉపన్యాసాలను వింటున్నట్లు దృశ్యాలు కనిపిస్తాయి. వీటన్నింటిని పరిశీలించిన చరిత్రకారులు ఇక్కడ జైన విద్యా పీఠం వెలసి ఉండవచ్చని, జైనాచార్యుడైన రససిద్ధుడు బోధన చేసి ఉంటారని పేర్కొంటారు. ఆది నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతను పాలెగాండ్ర వంశస్తులే నిర్వహిస్తూ వస్తున్నారు.


