పుట్టపర్తి టౌన్: బంగారు తాకట్టు పెట్టి రుణాలు పొందేవారి సంఖ్య జిల్లాలో ఇటీవల పెరిగింది. గ్రామీణ, పట్టణ తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ అధికంగా బంగారు రుణాలు పొందుతుండడం గమనార్హం. జిల్లాలో ప్రస్తుతం బ్యాంకులు, వివిధ ప్రైవేటు సంస్థల ద్వారా బంగారు రుణాలు నెలకు దాదాపు రూ. 20 కోట్లు తీసుకొంటున్నారు. గతంలో రూ. 12 కోట్ల వరకు బంగారు రుణాల లావాదేవీలు ఉంటే ఇప్పుడు రూ. 20 కోట్లకు పెరిగినట్లు తెలిసింది. 80 శాతం మంది బ్యాంక్‌లో తాకట్టు పెడుతున్నారు. మిగిలిన 20 శాతం ప్రైవేటు సంస్థల్లో కుదవ పెట్టి రుణం పొందుతున్నారు. బంగారు రుణాలపై బ్యాంకులు ఏడాదికి 9 శాతం వరకు, ప్రైవేటు సంస్థల్లో 10 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి.
సులువుగా రుణం ..
సాధారణంగా రుణం కోసం బ్యాంకులకు వెళితే సవాలక్ష నిబంధనలు పెడతారు. కొన్ని సార్లు నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణం పొందలేని పరిస్థితి. పైగా బడా బాబులు ష్యూరిటీ ఇస్తే తప్ప లోన్లివ్వరు. ఒక్కోసారి అటు తిప్పి ఇటు తిప్పి రుణం మంజూరు చేయకుండా కొర్రీలు పెడతారు. గోల్డ్ లోన్ అలా కాదు.. చేతిలో బంగారు నగలు ఉంటే చాలు బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థల్లో క్షణాల్లో రుణం మంజూరవుతోంది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు గోల్డ్ లోన్లు తీసుకుంటున్నారు.
మారుమూల ప్రాంతాల్లోనూ ఫైనాన్స్ సంస్థలు..
అవసరాలకు అప్పులు పుట్టని చాలా మంది గోల్డ్ లోన్లు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకొనే రుణానికి వడ్డీ ధర అధికంగా ఉండడంతో చాలామంది బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లో కూడా ఫైనాన్స్ కంపెనీలు వెలిశాయి. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు బంగారు నాణ్యతను బట్టి లోన్లు మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో పది గ్రాముల బంగారానికి రూ. 90 వేల దాకా రుణం ఇస్తున్నారు. జిల్లాలో ప్రధాన బ్యాంక్‌లతోపాటు పలు ప్రైవేటు సంస్థలు విరివిగా బంగారు రుణాలు మంజూరు చేస్తున్నాయి. కొందరు బంగారు కుదువ పెట్టి లోన్ తీసుకొని ఆ డబ్బుతో వ్యాపారాలు చేస్తున్నారు.
లాకర్లవైపు మక్కువ కరువు..
డబ్బు ఉన్నవారు సైతం బంగారాన్ని లాకర్లలో ఉంచు కోవడం తగ్గించేశారు. బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకొని పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. లేదంటే రుణం తీసుకున్న 90 శాతం నెలలోపు చెల్లిస్తున్నారు. మిగిలిన్న మొత్తాన్ని ఏడాదిలోపు వడ్డీతో చెల్లిస్తున్నారు. మళ్లీ బంగారు లోన్ కోసం బ్యాంకులో పెట్టేస్తున్నారు.జిల్లాలో ప్రధాన కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వివిధ బ్యాంక్ శాఖల్లో కిలోల కొద్దీ బంగారం ఉంది.
ధర పెరిగినా కొనుగోళ్లు
బంగారు ఆభరణాలు ఒంటిపై ఉంటే సమాజంలో గౌరవంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు.అత్యవసర సమయంలో ఉపయోగపడే నిధిగా భావిస్తుంటారు. అందుకే ధరలు భగ్గుమంటున్నా కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.
జిల్లాలో పెరుగుతున్న గోల్డ్ లోన్లు
వడ్డీ రేటు తక్కువ.. రిస్కూ తక్కువే
లోన్లు ఇవ్వడానికి ప్రైవేటు సంస్థలు కూడా ఆసక్తి
ప్రైవేటుగా అప్పయితే అధిక వడ్డీ కట్టాల్సిన దుస్థితి
అందుకే ధరలు పెరిగినా బంగారు కొనుగోళ్లపై ఆసక్తి


