తల్లీబిడ్డల అదృశ్యంపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

తల్లీబిడ్డల అదృశ్యంపై కేసు నమోదు

Mar 22 2026 2:05 AM | Updated on Mar 22 2026 2:05 AM

పుట్టపర్తి టౌన్‌: స్థానిక చిత్రావతి రోడ్డులో నివాసముంటున్న ఆది ఆంధ్ర సత్యం భార్య మేదర సోమేశ్వరి తన ఇద్దరు పిల్లలతో కలసి కనిపించకుండా పోయిందంటూ భర్త చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. వివరాలను శనివారం ఆయన వెల్లడించారు. రెండు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాలు, బంధువుల నివాసాలు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడన్నారు.

బైక్‌ బోల్తా –

యువకుడికి గాయాలు

గాండ్లపెంట: ద్విచక్ర వాహనం బోల్తాపడిన ఘటనలో ఓ యువకుడు గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన పవన్‌కుమార్‌ శనివారం ఉదయం ద్విచక్ర వాహనంపై కదిరికి బయలుదేరాడు. గాండ్లపెంట మండలం వేపరాల క్రాస్‌ వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో బైక్‌ అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయమైన పవన్‌కుమార్‌ను స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్‌ చేశారు.

కారు అదుపు తప్పి...

నల్లచెరువు: కారు అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు... చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన సంతోష్‌, శ్రావణి శనివారం ఉదయం కదిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి కారులో బయలుదేరారు. నల్లచెరువు మండలం రాట్నాలపల్లి సమీపంలోకి చేరుకోగానే 42వ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. కారు నుజ్జునుజ్జయింది. గాయపడిన సంతోష్‌, శ్రావణిని స్థానికులు 108 వాహనం ద్వారా కదిరిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement