హిందూపురం టౌన్: ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పండుగ సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్ధులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్న ఘటన హిందూపురం పట్టణంలో వెలుగు చూసింది. శనివారం దేశవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. అయినా హిందూపురంలోని నారాయణ పాఠశాల యాజమాన్యం మాత్రం విద్యార్థులకు సెలవు ఇవ్వకుండా మార్కుల కోసం, ర్యాంకుల కోసం ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేసింది. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులపై, ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకువస్తోంది. ర్యాంకులు, మార్కుల ఒత్తిడి భరించలేక రాష్ట్రంలో నారాయణ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అనేక మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా.. యాజమాన్యం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ విద్యార్థులను మానసికంగా వేధింపులకు గురి చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ తెలిసినా స్థానిక విద్యాశాఖ అధికారులు మాత్రం నోరుమెదపక పోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్న నారాయణ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఎంఈఓ గంగప్పను వివరణ కోరగా.. విద్యార్థుల తల్లిదండ్రులు కోరితేనే తరగతులు ఏర్పాటు చేసినట్లు నారాయణ పాఠశాల యాజమాన్యం తెలుపుతోందని వివరించారు.
సెలవు రోజుల్లోనూ విద్యార్థులకు
ప్రత్యేక తరగతులు
మార్కుల కోసం విద్యార్థులు,
ఉపాధ్యాయులపై ఒత్తిడి
ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్


