అరటి రైతుల కష్టాలు కనిపించలేదా? | - | Sakshi
Sakshi News home page

అరటి రైతుల కష్టాలు కనిపించలేదా?

Mar 22 2026 2:05 AM | Updated on Mar 22 2026 2:05 AM

అనంతపురం అర్బన్‌: ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరటి రైతుల కష్టాలు కనిపించడం లేదా అని రైతులు నిలదీశారు. అరటి రైతులను ఆదుకోవాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో అరటి గెలలు, బోదెలతో శనివారం అనంతపురంలోని కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ యుద్ధం నేపథ్యంలో అరటి పంట ఎగుమతులు నిలిచిపోయాయన్నారు. దీంతో ధర పతనమై రైతులు తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. 20 రోజుల క్రితం అరటి టన్ను రూ.22 వేల నుంచి రూ.25 వేలు ధర పలికిందన్నారు. ప్రస్తుతం టన్ను ధర ఐదారు వేల రూపాయలకు పడిపోయిందన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని, ధరలు లేకపోతే గిట్టుబాటు ధర కల్పిస్తాంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో గొప్పలు చెప్పారన్నారు. క్షేత్రస్థాయిలో అరటి రైతులు నష్టపోతుంటే మాత్రం పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి టన్ను రూ.25 వేలతో అరటి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు అరటి, బొప్పాయి, మొక్కజొన్న, మామిడి, తదితర పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్పయాదవ్‌, నాయకులు వన్నారెడ్డి, నారాయణస్వామి, రామకృష్ణ, వెంకటరాముడు, రామాంజినేయులు, తదితరులు పాల్గొన్నారు.

నేడు ‘కడపటి యుద్ధం’ ఆవిష్కరణ

అనంతపురం కల్చరల్‌: విలక్షణ రచయిత బండి నారాయణస్వామి కలం నుంచి జాలు వారిన ‘కడపటి యుద్ధం’ నవల ఆదివారం ఆవిష్కరణ కానుంది. స్పందన అనంత కవుల వేదిక ఆధ్వర్యంలో ఎన్జీఓ హోమ్‌ వేదికగా జరిగే ఈ కార్యక్రజుమానికి ప్రజాకవి గోరేటి వెంకన్న, భూమన్‌, లక్ష్మీనరసయ్య, నాగోలు కృష్ణారెడ్డి హాజరు కానున్నారు.

రాతిదూలం లాగుడు పోటీలు

కూడేరు: ఉగాది పండుగ నేపథ్యంలో కూడేరు మండలం కొర్రకోడులో గ్రామస్తుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు పోటాపోటీగా సాగాయి. 14 జతల వృషభాలను పోటీకి రైతులు తీసుకువచ్చారు. బొమ్మనహళ్‌ మండలం గోవిందవాడ గ్రామ రైతు గురుస్వామి వృషభాలు ప్రథమ స్థానంలో నిలవగా, అదే గ్రామానికి చెందిన రైతు నరసింహులు వృషభాలు ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. మూడో స్థానంలో విడపనకల్లు మండలం పెంచలపాడుకు చెందిన రైతు భీమలింగ వృషభాలు, నాల్గో స్థానంలో బొమ్మనహళ్‌ మండలం లింగాదహళ్‌కు చెందిన వృషభాలు, ఐదో స్థానంలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ రైతు మస్తానయ్య వృషభాలు, ఆరో స్థానంలో పత్తికొండ మండలం పులికొండ గ్రామ రైతు మాధవరాజులు వృషభాలు, ఏడో స్థానంలో వజ్రకరూరు మండలం ధర్మపురికి చెందిన రైతు అజిత్‌కుమార్‌ వృషభాలు, ఎనిమిదో స్థానంలో బొమ్మనహళ్‌ మండలం ఉద్దేహళ్‌కు చెందిన బసన్న వృషభాలు నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement