పుట్టపర్తి అర్బన్: ‘బాధ్యత గల పదవిలో ఉండి తప్పుడు పనులు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలి. తిరుపతిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం’ అని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాస లీలలు చేస్తూ దొరికిపోయిన బీఆర్ నాయుడు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసినా ఇప్పటి వరకూ చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని నాయకులు విమర్శించారు. దానిపై పచ్చ మీడియా సైతం కిమ్మనకుండా ఉండిపోయిందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువులో వైఎస్సార్‌సీపీ నాయకులు బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. నల్లరిబ్బన్‌లు జేబుకు ధరించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే కదిరి పట్టణంతో పాటు నియోజక వర్గంలోని తనకల్లు, పెనుకొండ నియోజకవర్గం పరిగిలో పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. పరిగిలో జరిగిన ధర్నాలో వైఎస్సార్‌సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం తప్ప చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. పగలు భక్తి .. రాత్రి రాసలీలు, తిరుమల గౌరవాన్ని కాపాడండి, తప్పు చేసిన వారు పదవిలో.. ప్రశ్నించే వారు బోనులో, బీఆర్ నాయుడు దిగిపో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
టీటీడీ చైర్మన్ పదవి నుంచి
బీఆర్ నాయుడును తొలగించాల్సిందే
జిల్లా వ్యాప్తంగా నిరసనకు దిగిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు


