స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి

Mar 25 2026 7:19 AM | Updated on Mar 25 2026 7:19 AM

ఎస్పీ సతీష్‌కుమార్‌

పుట్టపర్తి టౌన్‌: రానున్న స్థానిక సంస్థలఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక సాయి ఆరామంలో అన్ని సబ్‌డివిజన్లకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర వాటిపై దిశా నిర్దేశం చేశారు. వివిధ కేసుల్లో ధైర్య సాహసాలు, ప్రతిభ కనబరిచిన పోలీస్‌ అధికారులకు క్యాష్‌ రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ కేసుల్లో త్వరగా పురోగతి సాధించాలన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న నేరాలు, చోరీలు, గొడవలతో పాటు రౌడీషీటర్ల కదలికలపై దృష్టి సారించాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేయాలన్నారు. ఆర్టీసీ బప్టాండ్లలో చోరీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పదే పదే కేసుల్లో ఉన్న నేరస్తులపై పీడీ యాక్ట్‌ నమోదుకు సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ అంకిత సురానా, పోలీసు లీగల్‌ అడ్వైజర్‌ సాయినాథ్‌రెడ్డి, డీఎస్పీలు విజయకుమార్‌, మహేష్‌, నర్సింగప్ప, శివన్నారాయస్వామి, ఏఓ వేషుగోపాల్‌, డీసీఆర్‌బి సీఐ నరేంద్రరెడ్డి, డీటీఆర్‌బీ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోలీసు శాఖలో బిల్లుల దొంగ

రహస్యంగా సాగుతున్న విచారణ

పుట్టపర్తి టౌన్‌: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. అందుకే ఓ ఉద్యోగి పోలీసు కార్యాలయంలోనే అవినీతికి తెర లేపారు. గతంలో ఏఓగా పనిచేసిన ఓ అధికారి ఎడాపెడా బిల్లులు చేసుకుని భారీగా మింగేశారు. ఇటీవలే సదరు ఏఓ బదిలీల్లో భాగంగా మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. తన గుట్టు ఎవరికీ తెలియలేదని సంబరపడ్డారు. అయితే స్టేషనరీ పేరుతోనే రూ.లక్షలు దారి మళ్లించిన అంశాన్ని ఎస్పీ సతీష్‌కుమార్‌ ఇటీవల పసిగట్టారు. పోలీసు శాఖలోనే దొంగలున్నట్లు బయటకు తెలిస్తే శాఖ పరువుకు భంగమని భావించి రహస్యంగా సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. సదరు ఇంటి దొంగకు ఎవరు సహకరించారు. ఎవరి ఖాతాలో ఎంత వేసుకున్నారు. తదితర వివరాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

కేంద్రీయ విద్యాలయంలో

ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

గోరంట్ల: మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలోని నాసిన్‌ కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ బట్న కృష్ణారావు పేర్కొన్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని, ఏప్రిల్‌ 2 వరకూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మిగిలిన తరగతుల్లో ఏర్పడే ఖాళీలకు ఏప్రిల్‌ 2 నుంచి 8 వరకూ ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

40 సీట్లు

కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌లో 1వ తరగతికి 40 సీట్లు కేటాయించారు. మొదట కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర రంగ సంస్థలు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ పిల్లలకు ప్రాధాన్యత కల్పిస్తారు. అందలోనూ ఎస్సీ కుటుంబాల పిల్లలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం, ఇతరులకు మిగిలిన సీట్లు కేటాయించనున్నారు. http:// admission. kvs. gov. in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement