అనంతపురం: వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం ఫలించింది. కరువు సీమ వాసుల జీవనాడిగా ఉన్న ఆర్డీటీపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను ఎత్తి వేస్తూ విదేశీ నిధులు అందేలా ఎఫ్‌సీఆర్‌ఏ ను పునరుద్ధరించింది. 2031 సంవత్సరం వరకు ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీటీ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఐక్య పోరాటాలతో కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ తీసుకెళ్లిన ఒత్తిడి కారణంగా ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ సాధ్యమైందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ క్రెడిట్ చోరీ చేసేందుకు సీఎం చంద్రబాబు, లోకేష్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
2025లో ఆర్డీటీ ఖాతాలు ఫ్రీజ్
ఆర్డీటీ అనంతపురంలో 1969లో ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ వస్తోంది. అలాంటి సంస్థను చంద్రబాబు ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. 2025 ఏప్రిల్ 21న ఆర్డీటీ విదేశీ ఖాతాలను ఫ్రీజ్ అయ్యాయి. ఫలితంగా ఆర్డీటీ సంస్థ సేవలు నిలిచిపోవడంతో పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో చేయి చేయి కలిపారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన పోరాటంలో భాగస్వాములయ్యారు.
కళ్యాణదుర్గం నుంచే ప్రజా పోరాటం
ఆర్డీటీకు ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ కాకపోవడంతో నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం పెల్లుబుకింది. ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలతో జిల్లా అట్టుడికింది. మరో వైపు ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయాలంటూ వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. జిల్లాలో తొలుత ఆర్డీటీ ఎక్కడైతే కార్యకలాపాలు ప్రారంభించిందో అక్కడి నుంచే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ బాధ్యతలను భుజానకెత్తుకున్న తలారి రంగయ్య కళ్యాణదుర్గం నియోజకవర్గం బెళుగుప్ప మండలం గొంచితండా నుంచి పాదయాత్ర చేపట్టారు. 18 రోజులు సాగిన ఈ పాదయాత్ర 203 కిలోమీటర్ల మేర సాగి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 63 గ్రామాలు చుట్టేసింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ సాకే శైలజానాథ్, వై. విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2025 మే 17న బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో కుందుర్పిలో లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రధానికి చేరవేశారు. అనంతరం ఈ నెల 16న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. అదే రోజు న్యూఢిల్లీలో పార్లమెంట్ వద్ద పార్టీ ఎంపీలతో కలసి నిరసన వ్యక్తం చేశారు. ఇలా వరుస ఉద్యమాలతో ఢిల్లీని అట్టుడుకించి కేంద్రంపై ఒత్తిడి తీసుకెళ్లారు.
క్రెడిట్ చోరీకి సిద్ధమైన టీడీపీ నాయకులు
ఆర్డీటీ పరిరక్షణకు కృషి చేయాల్సిన అధికార పక్షానికి చెందిన టీడీపీ నాయకులు ఏ ఒక్క రోజూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కనీసం ఒక్క నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టలేకపోయారు. పేదల పక్షాన పోరాటం చేయని టీడీపీ నాయకులు తాజాగా తమ వల్లే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ అయ్యిందంటూ ప్రచారం చేసుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. పది నెలలుగా జిల్లాలో ఆర్టీటీ కోసం వైఎస్సార్‌సీపీ సాగించిన సుదీర్ఘ పోరాటానికి అఖిలపక్షం నేతలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు తోడయ్యారని, దీంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్టీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరించిందని అంటున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో పోరాటాలు సాగించిన ప్రతి వైఎస్సార్ సీపీ నాయకుడిని ప్రశంసిస్తున్నారు.
ఈ నెల 16న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి ఆర్డీటీ అంశంపై చర్చిస్తున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య
ఆర్డీటీ పరిరక్షణకు చేపట్టిన ఉద్యమంలో భాగంగా ప్రధానికి రాసిన పోస్టుకార్డులను చూపుతున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య (ఫైల్)
ఆర్డీటీకు ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించిన కేంద్ర ప్రభుత్వం
వైఎస్ జగన్ ఆదేశాలతో ఆర్డీటీ కోసం జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమం
మాజీ ఎంపీ తలారి రంగయ్య నేతృత్వంలో బైక్ ర్యాలీలు, 19 రోజుల పాదయాత్ర
లక్ష పోస్టు కార్డుల ఉద్యమంతో నేరుగా ప్రధానికి విజ్ఞప్తులు
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ ప్రజా పోరాటానికి లభించిన విజయం
ఏటా రూ.400 కోట్ల ఖర్చు
ఏటా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లను ప్రజల శ్రేయస్సు కోసం ఆర్డీటీ ఖర్చు చేస్తోంది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య, క్రీడలు, పేదలకు మెడికల్ బిల్లుల చెల్లింపు, పక్కా ఇళ్లు తదితర కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పటికే దాదాపు మూడు సంవత్సరాలు ఖర్చు చేసేంత మొత్తం ఆర్డీటీ ఖాతాల్లో ఉంది. అయితే ప్రభుత్వానికి సమాంతరంగా నడుస్తన్న ఆర్డీటీ కార్యకలాపాలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కన్నెర్ర చేశాయి. దీంతో ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ కాకుండా తిరకాసు పెడుతూ వచ్చాయి. ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ చేసేంత వరకూ నిధులు ఖర్చు చేయడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరించడంతో సంక్షేమానికి తెర తీసినట్లైంది.
ప్రజా నాయకుడికి అధినేత ఫోన్ కాల్
ఆర్డీటీకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ చేయాలంటూ అలుపెరగని పోరాటం చేసిన మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ జరిగిన విషయం తెలుసుకున్న ఆయన వెంటనే ఫోన్‌చేసి ప్రత్యేకంగా అభినందించడం గమనార్హం.


