హిందూపురం: స్థానిక పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పలువురికి రివార్డులు దక్కాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కావిడి నాగేంద్రను అరెస్ట్ చేసినందుకు గాను డీఎస్పీ కేవీ మహేష్.అప్‌గ్రేడ్ సీఐ ఆంజనేయులు, రూరల్ సీఐ జనార్ధన్, ఎస్‌ఐలు నరేంద్ర, మునీర్ అహమ్మద్, కానిస్టేబుళ్లు రవి, సుబ్రహ్మణ్యంతో పాటు బైండోవర్ కేసుల్లో నిబద్ధత చూపిన హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, లేపాక్షి ,చిలమత్తూరు ఎస్‌ఐలు నరేంద్ర, మునీర్ అహమ్మద్‌ను అభినందిస్తూ రివార్డులు, ప్రశంసా పత్రాలను ఎస్పీ సతీష్‌కుమార్ మంగళవారం అందజేశారు.
క్షయ రహిత జిల్లాగా మార్చాలి : డీఎంహెచ్‌ఓ
పుట్టపర్తి అర్బన్: క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం, జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనుపమా జేమ్స్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి వై జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్షయ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ సురేష్‌బాబు, డీపీఓ సమత, ఆర్డీఓ సువర్ణ, టీబీ మెడికల్ ఆపీసర్ డాక్టర్ గాయత్రి, ప్రోగ్రాం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం
నల్లచెరువు: మండలంలోని పి. కొత్తపల్లిలో రాయలసీమ వాసన్ సంస్థ ఇన్‌చార్జ్ ఉత్తప్ప ఆధ్వర్యంలో వేరుశనగ కాయల ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏపీ వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, కలెక్టర్ శ్యాం ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 30 ఎఫ్‌యూఓలతో కలిసి యూనిట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఓరువాయి పంచాయతీ మద్దేపల్లిలో ఎస్సీ రైతుల సాగునీటి సమస్య పరిష్కారానికి వాటర్ షేరింగ్ విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం వాటర్ షేరింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దార్ రవినాయక్, ఎంపీడీఓ అశోక్ కుమార్‌రెడ్డి, వ్యవసాయాధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, ఏఓ లక్ష్మీప్రియ, హెచ్‌ఓ లావణ్య పాల్గొన్నారు.
వేటగాళ్ల ఉచ్చుకు చిరుత కూన బలి
కళ్యాణదుర్గం రూరల్: వేటగాళ్లు పన్నిన ఉచ్చులో ఓ చిరుత కూన చిక్కుకుని ప్రాణాలు విడిచింది. చాపిరి సమీపంలో వేటగాళ్లు కుందేళ్ల కోసం పలు చోట్ల ఉచ్చులు ఏర్పాటు చేశారు. మంగళవారం అటువైపు వెళ్లిన కాపరులకు ఉచ్చులో చిక్కుకున్న రెండు చిరుత కూనలు కనిపించాయి. ఇందులో ఒకటి బయటపడేందుకు ప్రయత్నించి చివరకు మృతి చెందింది. మరొక కూనను తల్లి చిరుత నోటకరచుకుని రక్షించుకుంది. చిరుతల సంచారంపై అటవీ శాఖ అధికారులకు అనేకసార్లు సమాచారం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోయారు.


