బత్తలపల్లి: పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆర్టీటీకి కేంద్రం ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయడంతో ఆ సంస్థ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమైంది. విషయం తెలియగానే బత్తలపల్లిలోని ఫెర్రర్ ఘాట్‌కు క్షీరాభిషేకం చేశారు. వివిధ రకాల పూలతో అలకరించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీతో పాటు అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల సమష్టి పోరాటాల ఫలితంగా దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆర్టీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేసిందని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య వైఎస్సార్‌సీపీ ఎంపీలతో ఇటీవల పార్లమెంట్ ఎదుట ఆందోళన చేపట్టి, కరువు జిల్లాలో ఆర్డీటీ అంటే సంస్థ కాదని, అది జిల్లా పేదల జీవనాధారమంటూ చేసిన వ్యాఖ్యలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాని కదిలించాయని, ఫలితంగా ఆర్టీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ కు మార్గం సుగమమైదంటూ హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్దరణతో సేవలు మరింత విస్తరించనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీటీ ఉద్యోగులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.


