● సచివాలయం ఎదుట మహిళల ధర్నా
లేపాక్షి: మండలంలోని శిరివరం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో సమస్య పరిష్కరించాలంటూ మంగళవారం స్థానిక సచివాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న ఐదు బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉన్నా.. సరఫరా చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదారు నెలలుగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. నీటి కోసం పొలాల్లోని బోరుబావుల వద్దకు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. సమస్య పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేక పోయిందన్నారు. గ్రామాల్లో కనీసం సౌకర్యాలు సమకూరుస్తారని బాలకృష్ణకు ఓట్లు వేసి గెలిపిస్తే ఆయన తమ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించేవరకూ అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. స్పందించిన స్థానిక అధికారులు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు.
కేజీబీవీల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు
మడకశిర: జిల్లాలోని కేజీబీవీలో సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఉన్నాయని జీసీడీఓ అనిత తెలిపారు. మంగళవారం మడకశిర ఎంఈఓ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా కేజీబీవీల్లో సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. కొత్తగా ఎంపీహెచ్‌ఈఓ కోర్సును కూడా ప్రారంభించామన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి గాను ఒక్కో కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్లు, 6వ తరగతిలో 40 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని, అర్హులైన వారు ఏఫ్రిల్ 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏడు నుంచి తొమ్మిది వరకు ఆయా పాఠశాలల్లో ఉన్న ఖాళీల మేరకు సీట్లు భర్తీ చేస్తామన్నారు. ఇందులో ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీ 29, ఓసీ 50 శాతం మేర రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలు ఆదాయం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో ఎంఈఓలు భాస్కర్, నరసింహమూర్తి, రొళ్ల కేజీబీవీ ప్రిన్సిపాల్ మున్వర్‌జాన్ పాల్గొన్నారు.
కుమారుడి హత్య కేసులో తండ్రి అరెస్ట్
అనంతపురం సెంట్రల్: యువకుడి హత్య కేసులో కన్న తండ్రిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను మంగళవారం అనంతపురం వన్‌టౌన్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామానికి చెందిన చింతమాను సురేంద్ర కుటుంబం కొన్నేళ్లుగా అనంతపురంలోని వైఎస్సార్‌కాలనీలో నివాసముంటోంది. సురేంద్ర కుమారుడు ప్రదీప్ తాగుడకు బానిసై జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో గతనెల 11న రాత్రి తండ్రితో గొడవ పడ్డాడు. నిన్ను చంపుతానంటూ తండ్రి సురేంద్రను మత్తులో ఉన్న ప్రదీప్ బెదిరించాడు. దీంతో తనను చంపుతాడనే భయంతో ఇనుపరాడ్‌తో సురేంద్ర దాడి చేయడంతో ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కర్నూలులోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న తండ్రిని మంగళవారం కలెక్టరేట్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.


