తాడిమర్రి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తాడిమర్రి మండలం పుల్లంపల్లికి చెందిన రైతు మారినేని పురుషోత్తం రెడ్డి దానిమ్మ తోట దగ్ధమైంది. తనకున్న 17 ఎకరాల్లో పదేళ్ల క్రితం 3 వేల దానిమ్మ, జామ మొక్కలను రైతు నాటాడు. ప్రస్తుతం దానిమ్మ చెట్లను వాడు పెట్టాడు. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పు రవ్వలు ఎగిసి ఎండు గడ్డిపై పడి మంటలు రాజుకున్నాయి. సమాచారం అందుకున్న బాధిత రైతు, బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసే లోపు 3 వేల చెట్లు, డ్రిప్పు వైరు, పైపులు, తోట చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కాలిపోయింది. ఘటనతో సుమారు రూ.45 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు.


