బత్తలపల్లి: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిమర్రి మండలం మరువపల్లి నివాసి మదన్‌మోహన్, మరో ఇద్దరితో కలసి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఆర్డీటీ ఆస్పత్రి వద్దకు వచ్చాడు. అదే సమయంలో బత్తలపల్లి మండలం గంటాపురం నివాసి అక్కిం రెడ్డప్ప(35) ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట మదన్‌మోహన్ ఆపిన ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొని, ఎగిరి రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని వెంటనే ఆర్డీటీ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సకు స్పందించక సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు అక్కిం రెడ్డప్పకు భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
‘స్థలం అమ్మి అడ్డం తిరిగారు’
కదిరి టౌన్: రిజిస్టర్ చేయించుకున్న పొలం తిరిగి మాదే అని ఉద్దేశ పూర్వకంగా కోర్టులో పిటిషన్ వేసి మోసం చేయడమే కాకుండా ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు తమతో గొడవపడి బెదిరించారని సోమవారం బత్తలపల్లికి చెందిన చిత్ర శివయ్య పట్టణ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. వివరాలు .. కదిరికి చెందిన మాతంగి వెంకటాద్రి, బత్తలపల్లి మండలం వెంకటాపురానికి చెందిన వెంకటాద్రి తమ్ముడు మాతంగి వెంకటేష్ వారి కుటుంబ సభ్యుల నుంచి చిత్ర శివయ్య బత్తలపల్లి గ్రామ పొలంలో 97 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పుడు వారి కుటుంబ సభ్యులందరూ సంతకాలు చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ వెంకటాద్రి, వెంకటేష్ వారి బంధువులు మాటమార్చారు. దీనిపై ఉద్దేశ పూర్వకంగా కోర్టులో పిటిషన్ పెట్టడంతో పాటు అంతు చూస్తామని బెదిరిస్తున్నట్లు చిత్ర శివయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు.
మోటార్ల కేబుల్ చోరీ
బొమ్మనహాళ్: గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే మోటార్లకు అమర్చిన కేబుల్‌ను దొంగలు కట్‌చేసి తీసుకెళ్లిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని గోవిందవాడ, కల్లుదేవనహళ్లి గ్రామాలకు వేదావతి హగరి నది నుంచి నాలుగు విద్యుత్ మోటార్లు ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు విద్యుత్ మోటార్లకు అమర్చిన కేబుల్ చోరీ చేశారు. దాదాపు 350 మీటర్లు కేబుల్ చోరీ చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు, గ్రామస్తులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి మోటార్లకు కేబుల్ ఏర్పాటు చేసి నీటి సరఫరాను అందించాలని ప్రజలు కోరుతున్నారు.
కొబ్బరి చెట్టుపై పిడుగు
బెళుగుప్ప: శీర్పి గ్రామంలోని ఫెర్రర్ కాలనీలో ఏకాంబరప్ప ఇంటి వెనుక ఉన్న కొబ్బరిచెట్టుపై సోమవారం రాత్రి పిడుగుపడింది. చిరుజల్లులు పడే సమయంలో పెద్ద శబ్దంతో పిడుగుపడటంతో కాలనీవాసులు ఉలిక్కిపడి ఇళ్లలోంచి బయటకు వచ్చారు. అప్పటికే కొబ్బరి చెట్టు కాలుతూ కనిపించింది. అప్రమత్తమైన కాలనీవాసులు విద్యుత్ సరఫరాను నిలిపివేయించి.. కొబ్బరిచెట్టును మొత్తం యంత్రంతో కోసి వేయించారు. పిడుగు పడిన సమయం రాత్రి కావడంతో కాలనీలోని వారంతా ఇళ్లల్లో ఉన్నారు. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని చర్చించుకున్నారు.


